కోటికి పైగా టీకా డోస్ లతో భారత్ రికార్డు 

కరోనా నియంత్రణకు 34 రోజుల్లో కోటికిపైగా టీకా డోసులు ఇవ్వడం ద్వారా భారత్ రికార్డు నెలకొల్పిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వేగంగా వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తున్న దేశాల్లో భారత్‌ది రెండోస్థానమని పేర్కొన్నది. కోటి డోసుల వ్యాక్సినేషన్‌కు అమెరికాకు 31రోజులు, యుకెకు 56 రోజుల సమయం పట్టిందని తెలిపింది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకల్లా దేశంలో 1,01,88,007 టీకా డోసుల్ని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు ఇచ్చినట్టు తెలిపింది.

మొత్తం డోసుల్లో మొదటి డోస్ పొందిన ఆరోగ్య కార్యకర్తలు 62,60,242కాగా, వీరిలో రెండో డోసు కూడా పొందినవారు 6,10,899మంది, మొదటి డోస్ పొందిన ఫ్రంట్‌లైన్ వర్కర్స్ 33,16,866మంది ఉన్నారు. ఈ నెల 18న(34వ రోజున) మొత్తం 6,58,674 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. వీటిలో మొదటి డోస్ పొందినవారి సంఖ్య 4,16,942 కాగా, రెండో డోస్ పొందినవారి సంఖ్య 2,41,732. శుక్రవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో దేశంలో 13,193 కేసులు, 97మరణాలు నమోదయ్యాయి. 

అదే సమయంలో 10,896మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,542. మొత్తం కేసుల్లో ఇది 1.27 శాతం మాత్రమే. కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా మహారాష్ట్రలో 5427,కేరళలో 4584, తమిళనాడులో 457.మరణాల్లో అధికంగా మహారాష్ట్రలో 38, కేరళలో 14, పంజాబ్‌లో 10 ఉన్నాయి.

కాగా, షెడ్యూల్‌ ప్రకారం కొవిడ్‌-19 టీకాలు తీసుకోవాలని ఆరోగ్యకార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్ష వర్ధన్ విజ్ఞప్తి చేశారు. టీకాలు సురక్షితమైనవని, ఇమ్యునోజెనిసిటీ అన్ని ప్రమాణాలను నెరవేరుస్తాయని తెలిపారు. వ్యాక్సిన్లపై ఎలాంటి పుకార్లు, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరారు. దేశంలో తీవ్రమైన ప్రతికూల సంఘటనలు నమోదు కాలేదని, నివేదించబడిందని 0.0004 శాతమేనని తెలిపారు. 

కొవిడ్‌-19 టీకా కారణంగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.  ప్రతి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా టీకా కోసం పేరు నమోదు చేయించుకుని, ఇంకా టీకా వేయించుకోని ఆరోగ్య కార్యకర్తలకు ఈ నెల 20 వరకు, ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలకు మార్చి 6 నాటికి ఈ ప్రక్రియ ముగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.