ఉగ్రవాది కాల్పులలో ఇద్దరు పోలీసుల మృతి

శ్రీనగర్ లో పట్టపగలు నడిబజారులో అనేక మంది చూస్తుండగా సిసి కెమెరాల సాక్షిగా ఇద్దరు పోలీసులను ఒక ఉగ్రవాది శుక్రవారం హతమార్చాడు. ఈ సంఘటన శుక్రవారం శ్రీనగర్‌లోని ఎయిర్‌పోర్టుకు వెళ్లే బఘాత్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
డ్యూటీలో ఉన్న ఆ ఇద్దరు నిరాయుధ పోలీసులపై ఉగ్రవాది అత్యంత సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి పరారైనట్లు జమ్మూ కశ్మీరు పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదిని సాఖిబ్‌గా గుర్తించినట్లు ఆయన చెప్పారు.
 
చలికాలం ధరించే ఉన్నికోటులోపల దాచిన రైఫిల్‌ను బయటకు తీసి సాఖిబ్ ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపాడని ఆయన చెప్పారు. కాల్పులలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుళ్లు సుహేల్, మొహమ్మద్ యూసుఫ్‌ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వారిద్దరూ మరణించారు. 
 
కాల్పుల సంఘటన జరిగిన వెంటనే పోలీసు బృందాలు అక్కడకు చేరుకుని అక్కడి షాపులు, ఇళ్లలో ఏర్పాటు చేసిన సిసిటివి ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగానే కాల్పులు జరిపిన ఉగ్రవాదిని సాఖిబ్‌గా గుర్తించారు.
 
 శ్రీనగర్‌లోని బర్జుల్లా ప్రాంతానికి చెందిన సాఖిబ్ ఏ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడో వెంటనే తెలియరాలేదు. గడచిన మూడు రోజుల్లో ఉగ్రవాదుల దాడి జరగడం ఇది రెండవసారి. గత బుధవారం నగరంలోని దుర్గానాగ్ ప్రాంతంలో ఒక హోటల్ యజమాని కుమారునిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు.