జమ్ముకాశ్మీర్‌లో విదేశీ రాయబారుల పర్యటన 

జమ్ముకాశ్మీర్‌లో రెండు రోజుల పర్యటన కోసం విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలతో కూడిన 24 సభ్యుల బృందం బుధవారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకుంది. యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు), ఇతర దేశాలకు చెందిన బృందం పౌర సంఘాలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, విద్యార్థులతో సమావేశమైన జమ్ముకాశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోనుంది.

ఈ బృందానికి ఇయు రాయబారి ఉగో అస్తుతో నేతృత్వం వహిస్తున్నారు. కాగా, జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తరువాత నుంచి ఆ రాష్ట్రంలో విదేశీ రాయబారులు పర్యటించడం ఇది మూడోసారి. 

ఈ బృందం శ్రీనగర్ విమానాశ్రయంకు చేరుకోగానే నేరుగా మధ్య కాశ్మీర్ లోని బుడ్గామ్ జిల్లాకు వెళ్లి స్థానిక ప్రజలతో సమాలోచనలు జరిపారు. మేగం లో స్థానిక ప్రజలతో వారు ఎటువంటి సంకోచం లేకుండా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత శ్రీనగర్ లో ఇటీవల ఎన్నికైన జిల్లా అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు.

జమ్మూ, కాశ్మీర్ లో మొదటి సారిగా జిల్లా అభివృద్ధి మండళ్ళులలో 270 స్థానాలకు గత నవంబర్, డిసెంబర్ లలో ఎన్నికలు జరగడం తెలిసిందే. ఆరు పార్టీల గుప్కర్ కూటమి 102 సీట్లు గెలుచుకోగా, 75 సీట్ లతో బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ప్రభుత్వ అధికారులతో పాటు లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా సమావేశం జరుపుతారు. 

కాగా, ప్రస్తుతం పర్యటిస్తున్న బృందంలో చిలీ, బ్రెజిల్‌, కుబా, బలివియా, ఎస్తోనియా, , ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌, ఇయు, బెల్జియం, స్సెయిన్‌, స్వీడన్‌, ఇటలీ,  మలై, ఎరిత్రేయా, ఘన, సెనగల్‌ వంటి దేశాల రాయబారులు ఉన్నారు.  మలేసియా, బాంగ్లాదేశ్, సెనెగల్, టాజీకిస్తాన్ వంటి ముస్లిం దేశాల దౌత్యవేత్తలు కూడా ఈ బృందంలో ఉన్నారు.