గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ వెనుకడుగు!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ వెనుకడుగు!
వరుస పరాజయాలతో ఆత్మరక్షణలో పడిన టీఆర్ఎస్ నాయకత్వం ప్రస్తుతం జరుగుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ ఎన్నికలలో పోటీ పట్ల వెనుకడుగు వేస్తున్నది. కేవలం ఒకచోటనే పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.

 రెండు చోట్లా ఓడిపోతే పరువు పోతుందని.. అందుకని కేవలం సిట్టింగ్ స్థానం వరంగల్–నల్గొండ–ఖమ్మంలో మాత్రమే పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించే వరంగల్​సీటుకు సంబంధించి పల్లా రాజేశ్వర్ రెడ్డికి బుధవారం టీఆర్ఎస్​ బీఫామ్​ అందింది. ఇక రెండో సీటు విషయం తేలాల్సి ఉంది.

హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్ నగర్  గ్రాడ్యుయేట్​ సీటు నుంచి ఇప్పటి వరకు అధికారపక్షం గెలుపొందలేదు.  దుబ్బాక, జీహెచ్ఎంసీ ఓటములు పార్టీని వెంటాడుతున్న సమయంలో అంతగా పట్టులేని హైదరాబాద్ గ్రాడ్యుయేట్​ సీటు నుంచి పోటీ చేయడంకు వెనుకాడుతున్నారు. 

పైగా, హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ సీటు నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు జంకుతున్నారు. గెలిచే అవకాశమే లేనప్పుడు పోటీ చేయడం వృథా అనే అభిప్రాయంలో ఉన్నారు. నిజానికి రెండు గ్రాడ్యుయేట్​ సీట్లలో పోటీ చేయాలన్న ఉద్దేశంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో సమావేశం జరిపారు. 

పెద్ద ఎత్తున ఓట్లు నమోదు చేయించాలని ఆదేశించారు. తీరా ఓటర్ నమోదు పూర్తయ్యాక.. అసలు పోటీ చేసే అభ్యర్థి ​ ఎవరన్న సమస్య మొదలైంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తోపాటు గతంలో పోటీచేసి ఓడిన దేవిప్రసాద్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులను పోటీ చేయాలని అడిగితే.. వారంతా నిరాకరించినట్టు తెలుస్తున్నది.

ఇక వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్యెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు పరోక్షంగా మద్దతు ఇవ్వడం ద్వారా బిజెపి సిట్టింగ్ అభ్యర్థి ఎన్ రామచంద్రరావును ఓడించాలన్నదే అధికార పక్షం లక్ష్యంగా కనిపిస్తున్నది. అందుకోసమే వామపక్ష నేతలతో పాటు నాగేశ్వర్ సహితం  కొద్దీ కాలంగా అధికార పక్షం పట్ల సానుకూల ధోరణులు ప్రదర్శిస్తున్నారు.