జీఎస్టీ పరిధిలోకి నేచురల్‌ గ్యాస్‌!

జీఎస్టీ పరిధిలోకి నేచురల్‌ గ్యాస్‌!
అందుబాటు ధరల్లో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండేందుకు వీలు కల్పిస్తూ సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. సహజ వాయువును జీఎస్టీలోకి తీసుకువచ్చేందుకు భారత్‌ కట్టుబడి ఉందని, భారత ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రపంచ ఇన్వెస్టర్లను స్వాగతిస్తున్నామని చెప్పారు. 
 
తమిళనాడులో రామనాధపురం-తూత్తుకుడి నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ను, గ్యాసోలిన్‌ డీసల్ఫరైజేషన్‌ యూనిట్‌ను ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతికి అంకితం చేశారు. ఇక రూ 31,500 కోట్లతో సీపీసీఎల్‌ నిర్మించే గ్రాస్‌ రూట్‌ రిఫైనరీకి ఆయన శంకుస్ధాపన చేశారు.
 
2030 నాటికి భారత్‌ తన ఇంధన అవసరాల్లో నలభై శాతం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటుందని మోదీ వెల్లడించాయిరు.  2019-20లో భారత్‌ దేశీయ అవసరాల కోసం 85 శాతం చమురు నిల్వలను 53 శాతం గ్యాస్‌ను దిగుమతి చేసుకుందని వివరించారు.  
 
 వైవిధ్యభరితమైన, ప్రతిభా సంపన్నమైన మనలాంటి దేశం ఇంధనం కోసం దిగుమతులపై ఇంతగా ఆధారపడవచ్చునా? అని ప్రశ్నించారు.  మనం గతంలోనే ఈ ప్రాజెక్టులను చేపట్టిఉంటే మన మధ్యతరగతి ప్రజలపై ఇంధన భారాలు ఉండేవి కావనిస్పష్టం చేశారు.  ప్రస్తుతం సహజ వాయువు జీఎస్టీ పరిధిలో లేకపోవడంతో దానిపై కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్‌, సెంట్రల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ వంటి పలు పన్ను భారాలతో ఇంధన ధరలు భారంగా మారాయి. మధ్య తరగతి ప్రజల ఆందోళనలను తన ప్రభుత్వం అర్థం చేసుకోగలదని పేర్కొన్నారు.
రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేందుకు ఇథనాల్‌పై మన దేశం దృష్టి సారించిందని తెలిపారు. చెరకు నుంచి తీసిన ఇథనాల్‌ను పెట్రోలుకు కలుపుతున్నట్లు, తద్వారా దిగుమతులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెట్రోలులో 8.5 శాతం  ఇథనాల్ ఉంటోందని,  సౌరశక్తి పెరిగిందని, ప్రజా రవాణా, ఎల్ఈడీ బల్బుల వినియోగం, నిర్దిష్ట కాలపరిమితి దాటిన వాహనాలపై నిషేధం, సాగు నీటి పారుదలలో సోలార్ పంపుల వాడకం వంటి చర్యలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

2019-20 సంవత్సరంలో చమురు శుద్ధి సామర్థ్యంలో ప్రపంచంలో నాలుగో స్థానంలో మన దేశం ఉందని చెబుతూ దాదాపు 65.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్ట్స్‌ను ఎగుమతి చేసినట్లు ప్రధాని  తెలిపారు. ఈ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం భారత దేశ చమురు, సహజ వాయువు కంపెనీలు 27 దేశాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.