స్టార్టప్ కంపెనీలు నిలకడగా నిలదొక్కుకోవాలి 

స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు నిలకడగా నిలదొక్కుకోవడం గురించి ఆలోచించాలని, తద్వారా ప్రపంచానికి నాయకత్వం వహించే విధంగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విలువను మదింపు చేసుకుని, కంపెనీని వేరొకరికి అమ్ముకునే వ్యూహాలకు పరిమితం కారాదని హితవు చెప్పారు. 

దీర్ఘకాలం వర్ధిల్లే సంస్థలను ఏర్పాటు చేయడంపైనా, ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడంపైనా దృష్టి సారించాలని సూచించారు. నాస్‌కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరం (ఎన్‌టీఎల్ఎఫ్) 2021 సదస్సులో  మోదీ మాట్లాడుతూ, స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు వాల్యుయేషన్, ఎగ్జిట్ స్ట్రాటజీలకు పరిమితం కారాదని చెప్పారు.

ఈ శతాబ్దమంతా కొనసాగగలిగే సంస్థలను ఏవిధంగా ఏర్పాటు చేయగలమో ఆలోచించాలని కోరారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడం గురించి ఆలోచించాలని తెలిపారు. ఈ లక్ష్యాల సాధనలో రాజీ పడకూడదని చెప్పారు. ఈ లక్షణాలు లేకపోతే మనం అనుచరులుగానే మిగిలిపోతామని, గ్లోబల్ లీడర్‌గా ఎదగలేమని స్పష్టం చేశారు.

అత్యంత శక్తిమంతమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని చెప్పారు. మన సమాజం పూర్తిగా నగదుపై ఆధారపడటం నుంచి తక్కువ నగదుతో సరిపెట్టుకునే స్థాయికి మూడు నుంచి నాలుగేళ్ళలోనే మారిందని గుర్తు చేశారు. డిజిటల్ లావాదేవీల వల్ల నల్లధనం తగ్గుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. జన్‌ధన్, ఆధార్, మొబైల్ వల్ల పేదలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. మ్యాపింగ్, జియోస్పేషియల్ డేటాను నియంత్రణల నుంచి విముక్తి చేసినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఈ సంస్కరణలు దోహదపడతాయని తెలిపారు.

మ్యాపింగ్ సెక్టర్‌ను ఓపెన్ చేసినప్పటికీ, భద్రత పట్ల నమ్మకం ఉందని తెలిపారు. అవకాశాల నుంచి ప్రయోజనం పొందడానికి స్టార్టప్‌‌లకు పూర్తి స్వేచ్ఛ అవసరమని చెప్పారు. నాస్‌కామ్ స్ట్రాటజిక్ రివ్యూ తాజా నివేదిక ప్రకారం, ప్రపంచంలో మూడో అతి పెద్ద టెక్ స్టార్టప్ కేంద్రం భారత దేశమే. మన దేశంలో 12,500 టెక్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. 2020లో 1,600 టెక్ స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయి.