విదేశీ నిఘా సంస్థల నుంచి పీఎఫ్ఐకి నిధులు

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి విదేశీ నిఘా సంస్థల నుంచి నిధులు అందుతున్నాయని ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపారు. అయితే ఈ దేశాల పేర్లను వెల్లడించడం సాధ్యం కాదని చెప్పారు. పీఎఫ్ఐకి చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ వివరాలను వెల్లడించారు.

ఉత్తర ప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏడీజీ అమితాబ్ యశ్  మీడియాతో మాట్లాడుతూ, పీఎఫ్ఐ అగ్ర నాయకత్వంపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పీఎఫ్ఐకి చెందిన ఇద్దర్ని అరెస్టు చేశామని, వారిని ప్రశ్నించినపుడు ఈ సంస్థకు విదేశీ నిఘా సంస్థల నుంచి నిధులు అందుతున్నట్లు వెల్లడైందని తెలిపారు. 

విదేశీ నిఘా సంస్థలు, వ్యక్తులు పీఎఫ్ఐకి నిదులు సమకూర్చుతున్నట్లు బయటపడిందని వెల్లడించారు. పీఎఫ్ఐ యువతను రాడికలైజ్ చేస్తోందని, అటువంటి యువతను గుర్తించి, వారిని డీరాడికలైజ్ చేయడానికి కృషి జరుగుతోందని చెప్పారు. 

అరెస్టయిన పీఎఫ్ఐ అనుచరుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధ సామగ్రిని బట్టి వారి దురుద్దేశాలు తేటతెల్లమైనట్లు చెప్పారు. కొద్ది వారాలుగా వీరు దేశవ్యాప్తంగా తిరుగుతున్నట్లు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న రైల్వే టిక్కెట్లను బట్టి తెలుస్తోందని తెలిపారు. పీఎఫ్ఐ కేరళలో బలపడిందని, ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.