టెలికం పరికరాల తయారీకి రూ.12,195 కోట్ల  ప్రోత్సాహకాలు

దేశంలో టెలికం పరికరాల తయారీకి ఊతమిచ్చేలా ఐదేండ్లకుగాను రూ.12,195 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను (పీఎల్‌ఐ) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పీఎల్‌ఐ పథకానికి బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. త్వరలో 5జీ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానున్న క్రమంలో టెలికం పరికరాల తయారీకి భారత్‌ను గ్లోబల్‌ పవర్‌హౌజ్‌గా నిలబెట్టాలని మోదీ సర్కారు భావిస్తోంది.

ఇందులో భాగంగానే ఈ ప్యాకేజీని తెచ్చింది. ఇక ఈ పీఎల్‌ఐ పథకం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆచరణలోకి వస్తుంది. ఈ ప్రోత్సాహకం రాబోయే ఐదేండ్లకుపైగా కాలంలో రూ.2,44,200 కోట్ల ఉత్పత్తికి దోహదపడగలదని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. రూ.1,95,360 కోట్ల ఎగుమతులు కూడా ఉంటాయని ఆశిస్తున్నది.

టెలికం పరికరాల తయారీ పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలతో రూ.3వేల కోట్లకుపైగా పెట్టుబడులు రాగలవని ఓ అధికారిక ప్రకటనలో ప్రభుత్వం అభిప్రాయపడింది. అంతేగాక ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని భావిస్తున్నది. పన్నుల ఆదాయం కూడా రూ.17వేల కోట్ల మేర పెరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

అలాగే దేశంలోకి జరుగుతున్న టెలికం ఎక్విప్‌మెంట్‌ దిగుమతుల్లో రూ.50వేల కోట్లకుపైగా విలువైన దిగుమతులు తగ్గుతాయని క్యాబినెట్‌ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. దేశ, విదేశీ మార్కెట్ల కోసం భారత్‌లో తయారైన పరికరాల ఎగుమతులే ఉంటాయన్నారు. కాగా, పెరిగే పెట్టుబడులు, తయారైన ఉత్పత్తుల అమ్మకాల్లో వృద్ధి ఆధారంగా ఈ ప్రోత్సాహకాలుంటాయని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

భారత్‌-మారిషస్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో వ్యవసాయం, వస్త్ర, ఎలక్ట్రానిక్స్‌ తదితర రంగాలకు చెందిన 310 భారతీయ ఉత్పత్తులపై మారిషస్‌లో కస్టమ్స్‌ సుంకాలు తగ్గనున్నాయి. మరోవైపు మారిషస్‌కు చెందిన 615 ఉత్పత్తులకూ భారత్‌లో ప్రయోజనం లభించనున్నది.

ఫ్రోజెన్‌ ఫిష్‌, స్పెషాలిటీ షుగర్‌, బిస్కట్లు, తాజా పండ్లు, జ్యూస్‌లు, మినరల్‌ వాటర్‌, బీర్‌, సబ్బులు, బ్యాగులు, దుస్తులు మొదలైనవి ఇందులో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2019-20) దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మారిషస్‌ రెండో స్థానంలో ఉన్నది. జపాన్‌, కొరియాలతోనూ భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలున్నాయి. అలాగే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, యూరోపియన్‌ యూనియన్‌తో కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ పీసీల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కూడా ఓ పీఎల్‌ఐ పథకాన్ని త్వరలో ప్రభుత్వం తీసుకురానుందని రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. కాగా, టెలికం పరికరాల తయారీ పరిశ్రమ కోసం తెస్తున్న పీఎల్‌ఐ పథకానికి బేస్‌ ఇయర్‌గా 2019-20 నిర్ణయించామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు కనీస పెట్టుబడి రూ.10 కోట్లుగా, ఇతరులకు రూ.100 కోట్లుగా ఉంటుందని వివరించారు.

ఒక్కసారి ఎంపికైతే కనీస పెట్టుబడి పరిమితికి 20 రెట్ల వరకు మదుపరులకు ప్రోత్సాహకాలు లభిస్తాయని వెల్లడించారు. ఐదేండ్లకుపైగా కాలంలో వేర్వేరు విభాగాలకు, ఒక్కో ఏడాదికి 4 నుంచి 7 శాతం వరకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థ ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎగ్జిమ్‌ బ్యాంక్‌)లోకి మరో రూ.1,500 కోట్ల నిధులను  చొప్పించనున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయించిన రూ.1,300 కోట్ల కంటే ఇది రూ.200 కోట్లు అధికం.

దేశీయ ఎగుమతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ బ్యాంకును ఆర్థికంగా బలోపేతం చేయడానికి 2021-22లో 1,500 కోట్ల రూపాయల వరకు నిధులను వెచ్చించనున్నట్లు ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశంలో కేంద్రం స్పష్టంచేసిన విషయం తెలిసిందే.