జీఎస్టీ విధానం మరింత సరళతరం  

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని మరింత సరళతరం చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబులను మూడుకు కుదించాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. 
 
వీటిలో 12 శాతం, 18 శాతం శ్లాబులను ఒకే శ్లాబ్‌లోకి విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలో జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
ప్రస్తుతం భారత్‌లో 5, 12, 18, 28 శాతం శ్లాబ్‌లు ఉన్నాయి. వీటిని మూడింటికి తగ్గించాలని 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఎన్‌కే సింగ్‌ సూచించిన విషయం తెలిసిందే. అలాగే టెక్స్‌టైల్‌, పాదరక్షాలు, ఎరువులపై విధిస్తున్న జీఎస్టీ పన్నుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
 
కరోనా వైరస్‌తో వరుసగా భారీగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు గతేడాది డిసెంబర్‌ నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయి రూ.1.19 లక్షల కోట్లు వసూలయ్యాయి.