ప్రభుత్వాధికారులకు ఇక విద్యుత్ వాహనాలే!

దేశంలో అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లోని ఉద్యోగులు విద్యుత్‌తో నడిచే వాహనాలను వినియోగించడం తప్పనిసరి చేయాలనే అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రాజధాని ఢిల్లీలో 10 వేల విద్యుత్‌ వాహనాలను వాడటం మొదలుపెడితే.. ఒక నెలకు రూ.30 కోట్లు ఆదా అవుతుందని గడ్కరీ వెల్లడించారు. విద్యుత్‌తో నడిచే పరికరాల వినియోగానికి ప్రోత్సాహమిచ్చే ‘గో ఎలక్ట్రిక్‌’ ప్రచార కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. 
 
ప్రతి ఏటా చమురు దిగుమతులకు చేస్తున్న రూ 8 లక్షల కోట్ల వ్యయాన్ని తగ్గించుకోవడానికి విద్యుత్ వాహనాల వినియోగం దేశంలో పెంపొందించడమే మార్గమని కేంద్ర మంత్రి తెలిపారు. సాంప్రదాయక ఇంధనలతో పోల్చుకొంటే విద్యుత్ ఇంధనం చౌక కావడమే కాకుండా, కాలుష్యంకు ఆస్కారం ఉండదని, పైగా  పూర్తిగా స్వదేశీయమైనది అని చెప్పారు. 
 
 ఈ సందర్భంగా దేశంలో విద్యుత్ తో వంటకాలను ప్రోత్సహించే మార్గాలను అన్వేషించాలని విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్ కు గ్డకారి సూచించారు. ప్రభుత్వం వంట గ్యాస్‌కు ఇస్తున్న రాయితీతో పాటుగా విద్యుత్‌తో పనిచేసే వంట పరికరాలకు సబ్సిడీ ఇవ్వటం సముచితమని పేర్కొన్నారు. 
 
‘ మనం ఇప్పటికే గ్యాస్‌ వినియోగదారులకు సబ్సిడీ ఇస్తున్నాం. ఇటువంటి సమయంలో పర్యావరణానికి దోహదపడే ఎలక్ట్రిక్‌ వంట పరికరాలకు కూడా రాయితీ ఇందుకు ఇవ్వకూడదు!’అని ప్రశ్నించారు. ఎలక్ట్రిసిటీ కుకింగ్‌ వలన గ్యాస్‌పై అధికంగా ఆధారపడడాన్ని తగ్గిస్తుందని తెలిపారు. 
వ్యవసాయం నుండి హరిత ఇంధన వనరులను పెంపొందించే మార్గాలను కూడా విద్యుత్ శాఖ చూడాలని గడ్కరీ సూచించారు. ఆ విధంగా చేయడం వల్లన రైతులకు అదనపు ఆదాయ వనరులు ఏర్పడగలవని చెప్పారు.