మాజీ కేంద్ర మంత్రి సతీశ్ శర్మ కన్నుమూత

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సన్నిహితుడు, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కెప్టెన్ సతీష్ శర్మ (73) మృతి చెందారు.  ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సతీశ్ గోవాలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అక్టోబర్ 11, 1947న తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించారు. ప్రొఫెషనల్ కమర్షియల్ పైలట్ గా పని చేశాడు. సతీశ్‌ శర్మ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీతో పాటు 1983లో రాజకీయాలలో ప్రవేశించారు. అప్పటి నుండి గాంధీ కుటుంభంకు నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చారు.
రాయ్ బరేలి, అమేథి లోక్‌సభ స్థానాల నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచి ప్రజలకు సేవచేశారు. ఆయన పివి నర్సింహారావు ప్రభుత్వంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాగే మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి మరో మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతుళ్లు ఉన్నారు. శర్మ మృతిపై కాంగ్రెస్ నేత రణదీప్‌ సుర్జేవాలా సంతాపం ప్రకటించారు.
తొలి నుండి వివాదాలలో చిక్కు కొంటూ వస్తున్న ఆయనకు  గాంధీ కుటుంబానికి సన్నిహితమైన ఎం ఎల్ ఫోతేదార్, విన్సన్ట్ జార్జ్ వంటి వారితో మంచి సంబంధాలు ఉండేవి కావు. రాజీవ్ గాంధీ హయాంలోనే భూ లావాదేవీలకు సంబంధించిన వివాదంలో చిక్కుకున్నారు.
కేంద్ర మంత్రిగా పెట్రోల్ పంప్ బ్యాంకులు, కుకింగ్ గ్యాస్ ఏజెన్సీల కేటాయింపులలో కూడా ఆయనపై వివాదాలు చుట్టుముట్టాయి. 1997లో ఆయన చేసిన కేటాయింపులను కొట్టివేస్తూ “తానేదో రాజయిన్నట్లు, ఇవ్వన్నీ తన సొంత ఆస్తి అన్నట్లు” వ్యవహరించారని సతీష్ శర్మపై సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది.
 అక్రమ కేటాయింపులకు రూ 50 లక్షల జరిమానా విధించిన అత్యున్నత న్యాయస్థానం, తర్వాత జరిమానాను రద్దు చేసింది. 2016లో కపిల్ సిబాల్ ను రాజ్యసభకు పంపడం కోసం నాలుగోసారి శర్మకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్ నిరాకరించడంతో అప్పటి నుండి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.