స‌రైన స‌మ‌యంలో జ‌మ్ముక‌శ్మీర్‌కు రాష్ట్ర‌హోదా  

జ‌మ్ముక‌శ్మీర్‌కు స‌రైన స‌మ‌యంలో రాష్ట్రహోదాను పునరుద్ధ‌రిస్తామ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. జ‌మ్ముక‌శ్మీర్ రీఆర్గ‌నైజేష‌న్‌ బిల్లు-2021పై లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడిన అమిత్ షా.. జ‌మ్ముక‌శ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధ‌ర‌ణ‌పై ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేదని భరోసా ఇచ్చారు.

జ‌మ్ముక‌శ్మీర్ రీఆర్గ‌నైజేష‌న్ బిల్లు-2021 అంటే జ‌మ్ముక‌శ్మీర్‌కు రాష్ట్ర‌హోదా పున‌రుద్ధ‌ర‌ణను నిరాక‌రించే బిల్లు అని పలువురు ఎంపీలు అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నార‌ని, కానీ అందులో నిజం లేద‌ని హోంమంత్రి స్ప‌ష్టంచేశారు.  జ‌మ్ముక‌శ్మీర్‌కు రాష్ట్ర‌హోదా అక్క‌ర్లేదు అని ఆ బిల్లులో ఎక్క‌డ ఉన్న‌ద‌ని అమిత్ షా ప్ర‌శ్నించారు.

బిల్లులో అలాంటివేవీ లేకుండానే ఎంపీలు ఎలా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని నిల‌దీశారు. జ‌మ్ముక‌శ్మీర్ స‌రైన స‌మ‌యంలో రాష్ట్ర‌హోదా తిరిగిస్తామ‌ని తాను గ‌తంలోనే చెప్పాన‌ని, మ‌రోసారి స‌భాముఖంగా స్ప‌ష్టంచేస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌స్తుత బిల్లు ఆ ప్రాంత పున‌ర్నిర్మాణానికి సంబంధించిన‌ద‌ని, ఈ బిల్లుకు, రాష్ట్ర‌హోదాకు ఎలాంటి సంబంధం లేద‌ని అమిత్ షా చెప్పారు. కాగా, స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీ బిల్లుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేసింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు సంద‌ర్భంగా జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌లేద‌ని కాంగ్రెస్ లోక్‌స‌భాప‌క్ష నేత అధిర్ రంజ‌న్ ఛౌద‌రి విమ‌ర్శించారు.

పండిట్ల‌ను వెన‌క్కి ర‌ప్పిస్తామ‌ని, యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన ప్ర‌భుత్వం వాటి అమ‌లులో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అనంత‌రం, మాట్లాడిన అమిత్ షా కాంగ్రెస్ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఎంపీల ఆరోప‌ణ‌లు దురుద్ధేశంతో కూడిన‌వ‌ని, త‌గిన స‌మయం చూసి జ‌మ్ముక‌శ్మీర్‌కు రాష్ట్ర‌హోదా క‌ల్పిస్తామ‌ని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుధీర్ఘ చ‌ర్చ అనంతరం జ‌మ్ముక‌శ్మీర్ రీఆర్గ‌నైజేష‌న్ బిల్లు-2021కు లోక్‌స‌భ ఆమోద‌ముద్ర ప‌డింది.

అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నపై అమిత్ షా స్పందిస్తూ, అధికరణ 370ని రద్దు చేస్తూ తాము ఇచ్చిన హామీల అమలు గురించి తమను అడిగారని, జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను ఇస్తున్న ఈ అధికరణను రద్దు చేసి 17 నెలలు అవుతోందని పేర్కొన్నారు. ఈ కాలంలో అమలైన వాగ్దానాల గురించి తెలియజేయాలని తమను అడుగుతున్నారని ధ్వజమెత్తారు. 

డెబ్భయ్యేళ్ళలో కాంగ్రెస్ చేసినదేమిటో ఆ పార్టీ వివరించిందా? అని అడిగారు. ‘‘మీరు 70 ఏళ్లలో చేసిన పనులను వివరిస్తూ నివేదికను విడుదల చేశారా? మీరు సరిగ్గా పని చేశారా?’’ అని ప్రశ్నించారు. ‘‘మీరు సరిగ్గా పని చేసి ఉంటే, మీరు మమ్మల్ని అడగవలసిన అవసరం ఉండేది కాదు’’ అని ఎద్దేవా చేశారు. 

ప్రతి విషయంపైనా వివరణ, నివేదికలను సమర్పించేందుకు తాను సిద్ధమేనని, అందుకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే తరతరాలు పరిపాలించే అవకాశం పొందినవారు తమను తాము పరిశీలించుకోవాలని, నివేదికను డిమాండ్ చేసే అర్హత తమకు ఉందా? అనే అంశంపై ఆత్మావలోకనం చేసుకోవాలని హితవు చెప్పారు.