నిరసన తెలిపేందుకు కొన్ని హద్దులుంటాయి

నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. అయితే దానికంటూ కొన్ని హద్దులున్నాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎక్కడ పడితే అక్కడ..ఎప్పుడు పడితే అప్పుడు నిరసనలు చేయకూడదని స్పష్టం చేసింది.  అసమ్మతి, నిరసనలను వ్యక్తం చేసే హక్కు కొంత పరిధి మేరకే వర్తిస్తుందని, ఇది అన్ని వేళలా, అంతటా వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది

పౌరసత్వ సవరణ చట్టానికివ్యతిరేకంగా 2019లో ఢిల్లీలోని షహీన్ బాగ్ దగ్గర ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు రహదారి మొత్తాన్ని ఆక్రమించి రోజుల తరబడి ఆందోళనలు చేశారు. అయితే, దీనిపై గతేడాది సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షహీన్ బాగ్ ఆందోళనలు అక్రమమని తెలిపింది. కోర్టు ఆదేశాలపై 12 మంది స్వచ్ఛంద కార్యకర్తలు రివ్యూ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎక్కడపడితే అక్కడ.. ఎప్పుడు పడితే అక్కడ నిరసనలు చేసే హక్కు లేదు. ఎవరికైనా ఆందోళనలు చేసే హక్కు ఉంటుంది. అప్పటికప్పుడు అవి జరిగిపోవాలి తప్ప.. దీర్ఘకాలం పాటు ఆ అసమ్మతి గళాన్ని వినిపించకూడదని స్పష్టం చేసింది. 

కొన్ని సార్లు ఆకస్మిక నిరసనలు చేపట్టవచ్చునని, కానీ..ఇతర హక్కులను ప్రభావితం చేసేలా బహిరంగ ప్రదేశంలో ఆందోళనలు చేపట్టడం సరికాదని చెప్పింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా బహిరంగ స్థలాలను ఆక్రమించకూడదని, నిరసన హక్కులంటూ ప్రజల హక్కులను హరించరాదంటూ ధర్మాసనం తెలిపింది.బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు చేపట్టరాదని, నిర్ధేశించిన ప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చుచని పునురుద్ఘాటించింది.