చర్చి నిర్మాణాలకు జగన్ ప్రభుత్వ టెండర్లు… మోదీ విస్మయం 

ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నారని చెప్పగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. చర్చిల నిర్మాణానికి టెండర్లా? అని ప్రశ్నిస్తూ.. ఆశ్చర్యానికి గురయ్యారని, ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని మోదీ అన్నారని రఘురామ చెప్పారు. చర్చిల టెండర్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని, రఘురామకృష్ణరాజును మోదీ కోరారు.

ఈ రోజు ప్రధానిని కలిసి  ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని దృష్టికి తీసుకు వచ్చిన్నట్లు  రఘురామ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులు, దేవాలయాలపై దాడుల గురించి 25 పేజీల నివేదికను ప్రధానికి అందించినట్లు ఆయన వెల్లడించారు.  ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందన్న విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని రఘురామ చెప్పారు. కొన్ని గ్రామాల్లోని రికార్డుల్లో ఒక్క క్రైస్తవుడు కూడా లేకపోయినా 11 చర్చిలు ఉన్నాయని తెలిపానని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతమార్పిడి ప్రక్రియ జోరుగా సాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వమే చర్చిల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోందని, వాటికి టెండర్లను కూడా ఆహ్వానించిందని ప్రధానికి చెప్పానని వివరించారు.  

 రాజధాని మార్పు మొదలుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, దేవాలయాలపై దాడులు ఇలా అనేక విషయాలను ప్రధానికి ఆయన వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని అంటూ ఆయన రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు సానుకూల నిర్ణయం తీసుకోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ప్రధాని మోదీతో 18 నిమిషాల సమావేశం అద్భుతంగా సాగిందని  రఘురామ కృష్ణరాజు తెలిపారు. ‘నేను లేవనెత్తిన అన్ని అంశాలకు మోదీ సానుకూలంగా స్పందించారు. మీ చేతులపై శంకుస్థాపన చేసిన అమరావతిని నిలిపివేస్తే పేద రైతులకు అన్యాయం జరుగుందని చెప్పా’ అని వెల్లడించారు. 

“మీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన రాజధాని నిలిచిపోతే.. స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూములిచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంది. మీరు శంకుస్థాపన చేసిన రాజధానిని మూడు రాజధానుల పేరుతో తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించింది. అమరావతికి మీ మద్దతు కూడా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు దగా పడకూడదు. అమరావతిని రక్షించండి” అని ప్రధానికి వివరించినట్లు చెప్పారు. 
 
రాజధానికోసం భూములిచ్చిన రైతుల్లో బడుగు, బలహీనవర్గాల రైతులే పెద్ద సంఖ్యలో ఉన్నారని, కానీ.. ఏపీ ప్రభుత్వం ఒకే సామాజికవర్గం వారు అధికంగా ఉన్నారంటూ అపోహలు సృష్టించి, రాజధాని తరలింపునకు కుట్ర పన్నిందని ప్రధానికి వివరించినట్లు చెప్పారు.

ఇప్పటికే అమరావతిలో వివిధ నిర్మాణాలకు రూ 50,000 మేరకు ఖర్చు చేశారని, ఇప్పుడు అక్కడి నుండి రాజధానిని మరో ప్రాంతంకు మార్చితే ప్రభుత్వంకు ఉచితంగా భూములు ఇచ్చిన రైతులకు లక్ష కోట్ల రూపాయల మేరకు పరిహారం చెల్లింపు వలసి ఉంటుందని ప్రధాని దృష్టికి తీసుకు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై న్యాయపోరాటం జరుగుతున్న విషయానికి కూడా ఆయనకు తెలిపినట్లు చెప్పారు. 

ఏపీ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాడని, ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి సహితం ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పిన్నట్లు పేర్కొన్నారు.