దేశానికి  ప్రళయ కారకుడిగా మారుతున్న రాహుల్ 

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ నిరంతరం అవమానిస్తున్నారని, అనేక అంశాలపై బూటకపు కథనాలను సృష్టిస్తున్నారని, ఆయన మన దేశానికి  ప్రళయ కారకుడిగా మారుతున్నారని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మండిపడ్డారు.

లోక్ సభలో బడ్జెట్‌పై చర్చకు సమాధానమిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అనేక ఆరోపణలు చేస్తున్నారని, బూటకపు కథనాలను సృష్టిస్తున్నారని, ప్రభుత్వం చెప్పే సమాధానాలను వినేందుకు ఆయనకు సహనం ఉండటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న రెండు రకాల వైఖరులను గుర్తించవలసిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పార్లమెంటరీ వ్యవస్థపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదని స్పష్టమవుతోందని ఆర్ధిక మంత్రి విమర్శించారు. రాహుల్ గాంధీ గురువారం పార్లమెంటులో బడ్జెట్‌పై మాట్లాడేందుకు నిరాకరించి, కొత్త సాగు చట్టాలపై మాట్లాడారు. దీనిపై నిర్మల సీతారామన్ స్పందిస్తూ, రాహుల్ గాంధీ బహుశా భారత దేశానికి ప్రళయ కారకుడిగా మారుతున్నారని దుయ్యబట్టారు.

 రాహుల్ గాంధీ పది అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలని తాను కోరుకున్నానని, అయితే వాటి గురించి ప్రస్తావించకుండా, తనను నిరాశకు గురిచేశారని అన్నాఆమె విచారం వ్యక్తం చేశారు. సాగు చట్టాలపై కాంగ్రెస్ యూ-టర్న్ తీసుకోవడానికి కారణాలను తెలుసుకోవాలని అనుకున్నానని, అయితే తనకు సమాధానం లభించ లేదని ఆమె చెప్పారు. 

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలలో హామీ ఇచ్చినట్లుగా రైతుల పంట రుణాలను ఆ రాష్ట్రాల్లో ఎందుకు రద్దు చేయలేదో తెలుసుకోవాలనుకుంటున్నానని ఆమె నిలదీశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉందని, అక్కడి రైతుల సమస్యలపై రాహుల్ గాంధీ మాట్లాడటం లేదని ఆమె ఎద్దేవా చేశారు. 

పంట దుబ్బుల కాల్చివేతపై పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఆయన మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. కొత్త సాగు చట్టాల్లో రైతులకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలేమిటో ఆయన చెప్పడం లేదని దుయ్యబట్టారు. 

కాంగ్రెస్ పార్టీ కేవలం ‘‘మేమిద్దరం, మాకు ఇద్దరు’’  గురించి మాత్రమే ఆలోచిస్తోందని, రైతుల నుంచి ‘‘అల్లుడు గారు’’ కొట్టేసిన భూమిని తిరిగి రాహుల్ ఇచ్చేస్తారని తాను భావించానని అంటూ ఆర్ధిక మంత్రి ఎద్దేవా చేశారు. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీల సంస్కరణలను మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సమర్థించారని, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం లేదని గుర్తు చేశారు.