విరాళాల అక్రమాల ఆరోపణలపై తలెత్తిన వివాదం నేపథ్యంలో, అయోధ్య, ఇతర ప్రాంతాల సాధువుల విశ్వాసాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం నాడు ఆలయంలోని అన్ని మతపరమైన వ్యవహారాలను పర్యవేక్షించడానికి తొమ్మిది మంది సాధువులతో కూడిన ధార్మిక కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, కానుకల లెక్కింపు బాధ్యతను అప్పగించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఉన్న తమ ఒప్పందాన్ని సమీక్షించనున్నట్లు ప్రకటించింది.
జూన్ ఆరంభంలో ఈ వివాదం చెలరేగిన తర్వాత జరిగిన ట్రస్ట్ రెండవ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.ఆరోపించచిన నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, “మీడియా, ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడానికి” ట్రస్ట్ ఒక అధికార ప్రతినిధిని నియమించింది.
5,200కు పైగా దరఖాస్తులను పరిశీలించడానికి ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ మరింత సమయం కోరడంతో, ట్రస్ట్ తన మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ) నియామకాన్ని ఒక నెల పాటు వాయిదా వేసింది.సిట్ నివేదిక తర్వాతే సీఈవో నియామకంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ముగ్గురు సభ్యుల సిఈఓ ఎంపిక కమిటీకి ఒక కార్యదర్శి నియామకాన్ని కూడా ఆమోదించింది.ధార్మిక కమిటీలో అయోధ్యకు చెందిన ఐదుగురు సాధువులు, వేరే ప్రాంతాల నుంచి నలుగురు సభ్యులుగా ఉంటారు.
ధార్మిక కమిటీకి ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో సభ్యులు: జగద్గురు శంకరాచార్య జ్యోతిష్పీఠాధిపతి శ్రీ వాసుదేవానంద సరస్వతి జీ మహారాజ్, మాధ్వపీఠాధిపతి స్వామి విశ్వప్రసన్నతీర్థ జీ మహారాజ్, స్వామి యుగపురుష్ పరమానంద జీ, స్వామి దినేంద్రదాస్ జీ (నిర్మోహి అఖారా), స్వామి కమలనయనదాస్ జీ (మణిరామ్ ఛావనీ), మహంత్ రాజ్‌కుమార్ దాస్ జీ (రామవల్లభ కుంజ్), స్వామి రామానంద దాస్ జీ (రామ కథా కుంజ్), స్వామి మిథిలేశనందిని శరణ్ జీ.
“రామ మందిరానికి సంబంధించిన అన్ని మతపరమైన కార్యకలాపాలపై ధార్మిక కమిటీకి అధికారం ఉంటుంది. ఆలయం ఇకపై అయోధ్య గురువుల మార్గదర్శకత్వంలో పనిచేస్తుంది. మతపరమైన విషయాలపై వారి నిర్ణయాలే సర్వోన్నతమైనవి. ట్రస్ట్ సభ్యులు తమ తమ పాత్రలలో కొనసాగుతారు, కానీ కమిటీ నిర్ణయాలను అంగీకరించి, అమలు చేస్తారు” అని గిరి తెలిపారు.
అన్ని పూజలు వైదిక రామానంది సంప్రదాయాన్ని అనుసరించేలా చూడటం కమిటీ బాధ్యతలలో ఒకటి. రాబోయే శ్రావణ మాసంలో భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నందున, దానిని దృష్టిలో ఉంచుకుని అనేక నిర్ణయాలు తీసుకున్నామని తాత్కాలిక ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్ తెలిపారు. భారత ప్రభుత్వ మింట్ ద్వారా బంగారం, వెండి కానుకల స్వతంత్ర ధృవీకరణను కూడా ట్రస్ట్ కొనసాగిస్తుందని మోహన్ చెప్పారు.
తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధార్మిక కమిటీ ఏర్పాటును సమావేశంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా అభివర్ణిస్తూ, ఆలయంలోని అన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్దేశించిన వైదిక రామానంది సంప్రదాయానికి అనుగుణంగా కచ్చితంగా జరిగేలా ఈ కమిటీ నిర్ధారిస్తుందని ట్రస్ట్ కోశాధికారి గిరి తెలిపారు. ఈ కమిటీ, పండుగలు, మతపరమైన వేడుకల వార్షిక క్యాలెండర్‌పై కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆలయంలోని 14 మందిరాలకు పూజారుల నియామకం, శిక్షణ, పనితీరును పర్యవేక్షిస్తుంది.
అర్చకుల శిక్షణా కేంద్రం
రామాలయంలో అర్చకత్వం నిర్వహించే పూజారుల కోసం ఓ శాశ్వత శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు గోవింద్ దేవ్ గిరి వెల్లడించారు. రామ మందిరం నుండి ధృవీకరణతో, ఆచార వ్యవహారాలు, ఆలయ నిర్వహణ, పూజా విధానాలను బోధించడానికి ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న అర్చకులకు ట్రస్ట్ ద్వారా ధ్రువపత్రాలను అందజేస్తామని చెప్పారు. ఈ కేంద్రం ధార్మిక కమిటీ పరిధిలోకి కూడా వస్తుంది.
అంతేకాకుండా, రామ మందిరంతో తమ అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కమిటీ అయోధ్యలోని మఠాలు, ఆలయాలు, గురుకులాలతో సమన్వయం చేసుకుంటుంది. ఈ చర్య వెనుక ఉన్న హేతుబద్ధతను వివరిస్తూ, గిరి ఇలా అన్నారు, “అయోధ్యలోని ప్రతి నివాసి ఇది తమ సొంత ఆలయం అని భావించాలి.”
విరాళాల లెక్కింపు ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న సిట్ ఇంకా తన నివేదికను సమర్పించలేదని, అందువల్ల ఈ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని కృష్ణ మోహన్ తెలిపారు. ఈ విషయానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో జరుగుతున్న విచారణను కూడా ట్రస్ట్ గమనించింది.
విరాళాల లెక్కింపును ఎస్‌బిఐ నిర్వహించిన తీరుపై ఆందోళన, నిరాశ వ్యక్తం చేస్తూ, తుది నిర్ణయం తీసుకునే ముందు బ్యాంకుతో ఉన్న ఏర్పాటును పునఃపరిశీలించాలని ట్రస్ట్ తన ఆర్థిక కమిటీని ఆదేశించింది. ఇటీవలి ఆరోపణలు ఉన్నప్పటికీ యాత్రికుల ప్రవాహం కొనసాగడం శ్రీరామునిపై భక్తుల అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ట్రస్ట్ పేర్కొంది. అలాగే, ఖాళీగా ఉన్న ట్రస్టీల పదవులను భర్తీ చేయడానికి కొంత సమయం పడుతుందని కూడా తెలిపింది.
More Stories
రాజధాని నిరసనలను చక్కదిద్దెందుకు ప్రభుత్వ ప్రయత్నాలు ముమ్మరం
ఎన్డీయేకు మద్దతు కధనాల మధ్య ప్రధాని మోదీని కలిసిన శరద్ పవార్
పార్లమెంటులో పరీక్షలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం