అధికారం కోసం దేశాన్ని  ముక్కలు చేసిన వంశం!

చైనాకు భారత భూభాగాన్ని అప్పగించేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కుదిరిన దళాల ఉపసంహరణ ఒప్పందంలో భాగంగా భారత దేశానికి చెందిన ఏ భూమినీ చైనాకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. 

వేల కొద్దీ చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని వదులుకున్న పాపానికి పాల్పడినది కాంగ్రెసేనని దుయ్యబట్టారు. అవినీతిమయమైన, పిరికితనం నిండిన ఓ వంశం తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం దేశాన్ని ముక్కలు చేసిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం మాట్లాడుతూ, భారత దేశ భూభాగం ఫింగర్ 4 వరకు ఉందని, భారతీయ దళాలను ఫింగ్ 3 వరకు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని ప్రశ్నించారు. డెప్సాంగ్ ప్లెయిన్స్, గోగ్రా- హాట్ స్ప్రింగ్స్ పరిస్థితిపై స్పష్టత లేదన్నారు. భారత దేశ భూభాగాన్ని చైనాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అప్పగించారని ఆరోపించారు.

దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన జేపీ నడ్డా, వేలాది చదరపు కిలోమీటర్ల భూమిని వదులుకున్న పాపానికి ఎవరైనా పాల్పడ్డారంటే, అది కేవలం తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం అవినీతిమయమైన, పిరికితనం నిండిన ఓ వంశమేనని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ వల్ల నేటి (శుక్రవారం) నుంచి కాంగ్రెస్ సర్కస్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఎద్దేవా చేశారు. 

దళాల ఉపసంహరణ వల్ల మన దేశానికి నష్టం జరుగుతుందనే తప్పుడు వాదనను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్-చైనా ఒప్పందంలో భాగమా? అని నిలదీశారు. దళాల ఉపసంహరణ ప్రక్రియను సాయుధ దళాలు నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ వైఖరి ధైర్య, సాహసాలుగల మన దళాలను అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ మన దళాలపై అవిశ్వాసం వ్యక్తం చేస్తోందని దుయ్యబట్టారు. మన దళాలను యూపీయే ఎన్నడూ విశ్వసించలేదనేది అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. మన దళాల చేతులను యూపీయే కట్టిపడేసిందని దయ్యబట్టారు. 

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశ భూభాగం ఫింగర్ 4 వరకు ఉందని చెప్పడం పూర్తిగా, స్పష్టంగా తప్పు అని తెలిపింది. భారత దేశ భూభాగం మ్యాప్‌లో కనిపిస్తున్నట్లుగా, 43,000 చదరపు కిలోమీటర్ల భూభాగం 1962 నుంచి చైనా చట్టవిరుద్ధ ఆక్రమణలో ఉందని తెలిపింది. 

భారత దేశం దృష్టిలో వాస్తవాధీన రేఖ ఫింగర్ 8 వద్ద ఉందని, ఫింగర్ 4 వద్ద కాదని తెలిపింది. అందుకే చైనాతో ప్రస్తుత అవగాహనతో సహా, ఫింగర్ 8 వరకు గస్తీ హక్కులను పట్టుదలగా అమలు చేస్తోందని పేర్కొంది. 

గత ఏడాది మే నెల నుంచి తూర్పు లడఖ్‌లో భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన  ఏర్పడిన సంగతి తెలిసిందే. దశలవారీగా ఇరు దేశాల సైన్యాలను ఉపసంహరించేందుకు తాజాగా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరు దేశాలు తమ దళాలను వెనుకకు తీసుకెళ్తున్నాయి.