ప‌్ర‌భుత్వ హెచ్చ‌రిక‌ల‌కు దిగివచ్చిన ట్విట‌ర్  

ప‌్ర‌భుత్వ హెచ్చ‌రిక‌ల‌కు ట్విట‌ర్ దిగి వ‌చ్చిన‌ట్లే కనిపిస్తోంది. పాకిస్థాన్‌, ఖ‌లిస్తాన్‌కు చెందిన 1178 అకౌంట్లు, వాళ్లు చేసిన పోస్టుల‌ను బ్లాక్ చేయాల్సిందిగా ఇచ్చిన ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ట్విట‌ర్ పాటించింది. 
 
ఇప్ప‌టికే వీటిలో 97 శాతం బ్లాక్ చేసిన‌ట్లు ట్విట‌ర్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. బుధ‌వారం సాయంత్రం కేంద్ర ఐటీ శాఖ కార్య‌ద‌ర్శితో ట్విట‌ర్ ప్ర‌తినిధులు స‌మావేశ‌మైన త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. స్థానిక చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డ‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆ స‌మావేశంలో ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.
ఆ అకౌంట్ల‌ను బ్లాక్ చేయ‌డంలో ఎందుకు ఆల‌స్యం చేస్తున్నార‌ని ప్ర‌భుత్వం ప్ర‌శ్నించింది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం, రిపబ్లిక్‌ డే హింస ఘటనల నేపథ్యంలో కేంద్రం ట్విటర్‌పై ఫైర్ అయింది.
పాకిస్తాన్,  ఖలిస్తాన్ అనుకూల ట్విటర్‌ ఖాతాలను, అలాగే “రైతుల మారణహోమం” లాంటి  హ్యాష్‌ట్యాగ్‌లను వ్యాప్తి చేస్తున్న 1435 యూజర్ల ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ట్విటర్‌కు నోటిసులిచ్చింది. అయితే భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించ లేమంటూ కొన్ని ఖాతాలను బ్యాన్‌కు నిరాకరించింది.
అయితే విద్వేషాన్ని రగిలించే “హానికరమైన కంటెంట్‌ను” ను నిరోధిస్తున్నామని, నిబంధనలను ఉల్లంఘించిన 500 ఖాతాలను శాశ్వతంగా నిలిపివేసిందని పేర్కొంది. దీనిపై ప్ర‌భుత్వం తీవ్ర అస‌హనం వ్య‌క్తం చేసింది.
గురువారం రాజ్యసభలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్‌, ఫేస్‌బుక్‌, లింక్‌డ్‌ఇన్‌, వాట్సాప్‌సహా ఏ సోషల్ ‌మీడియా సంస్థ అయినా భారత రాజ్యాంగం, చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హెచ్చరించారు.  మరోవంక, ప్రజాస్వామ్య విలువలను అగౌరవ పరచడం ఆమోదయోచేందుకు ఒక విధానాన్నిరూపొందించాలంటూ సుప్రీంకోర్టు  ట్విటర్‌, కేంద్రానికి నోటిసులిచ్చింది.