భారత్​ జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతం.. ప్రధాని మోదీ హర్షం

భారత్​ జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతం.. ప్రధాని మోదీ హర్షం
గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26లో) భారత జిడిపి 7.7 శాతం పెరిగిందని  కేంద్ర గణాంకాల శాఖ ప్రకటించింది. 2024-25లో 7. 1శాతంగా ఉన్న జిడిపి తగ్గుతుందని అనేక సంస్థలు అంచనా వేశాయి. దేశంలో అధిక ధరలు, పెరిగిన నిరుద్యోగం, హరించుకుపోతున్న ఆదాయాలకు తోడు అమెరికా అధిక టారిఫ్‌‌లు, పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం, ఎగుమతుల పతనం తదితర ప్రతికూల పరిణామాల్లోనూ జిడిపి పెరగడం గమనార్హం.
 
పెరుగుతున్న అంతర్జా తీయ, దేశీయ ముప్పుల కారణంగా జిడిపి ఒత్తిడికి గురి కావొచ్చని ఆర్‌‌బిఐ సహా అనేక సంస్థలు, ఆర్థిక వేత్తలు పేర్కొన్న సంగతి తెలిసిందే. 2022-23ను బేస్‌ ఇయర్‌‌గా పేర్కొంగా ఎన్‌ఎస్‌ఒ ఈ గణాంకాలను ప్రకటించింది. వీటి ప్రకారం 2026 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలోనూ 7.8 శాతం వృద్ధి నమోదయ్యింది. గతేడాది మార్చి త్రైమాసికంలో ఉన్న రూ. 81.40 లక్షల కోట్ల జిడిపి.. క్రితం క్యూ4లో రూ. 87.77 లక్షల కోట్లకు పెరిగింది.

“ప్రస్తుతానికి ఆర్​బీఐ అంచనాలను సందేహించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు వెల్లడించిన గణాంకాల విషయంలో వృద్ధి పెరిగే లేదా తగ్గే అవకాశాలు రెండూ ఉన్నాయి. కాబట్టి, ఆర్​బీఐ అంచనా సూచించినట్లుగా వృద్ధి రేటు 7 శాతం కంటే తగ్గినా సరే స్థూల ఆర్థిక స్థిరత్వ చర్యలు, సరఫరా భరోసా చర్యలు మనల్ని బాహ్య పరిస్థితులు మెరుగుపడిన వెంటనే తిరిగి 7 శాతం కంటే ఎక్కువ వృద్ధి బాటలోకి తీసుకువస్తాయి. ఒకవేళ ప్రస్తుత పరిస్థితులే ఇలానే కొనసాగితే, మేము తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలను పునఃపరిశీలిస్తాము” అని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. 

కాగా, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ  కొనియాడారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7.7 శాతంగా నమోదుకావడం, అదే ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదు కావడం భారత ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత బలాన్ని ప్రతిబింబిస్తోందని ఎక్స్ వేధిక‌గా పేర్కొన్నారు.

ఈ వృద్ధి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలితమని, అలాగే 140 కోట్ల మంది భారతీయుల కృషికి నిదర్శనమని ప్రధాని చెప్పారు.  దేశ అభివృద్ధిలో ప్రజల పాత్ర అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’, వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.  దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ఎలాంటి అవకాశాన్నీ వదులుకోదని మోదీ పేర్కొన్నారు.