స్టీల్ ప్లాంట్ నిర్ణయానికి మేము వ్యతిరేకం

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పష్టం చేసారు.  విశాఖ పర్యటనకు వచ్చిన ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 
 
స్టీల్‌ ప్లాంట్‌పై  కేంద్రం ప్రకటన చేసిన తర్వాత తమకు తెలిసిందని ఆమె చప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌తో విశాఖ వాసులకు, రాష్ట్ర ప్రజలకు విడదీయని బంధం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిలుపుదల కోసం ప్రయత్నం చేస్తానని ఆమె తెలిపారు.
 
స్థానిక టిడిపి ఎమ్యెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా ప్రకటించడాన్ని ప్రస్తావించగా, రాజీనామాలపై స్పందించనని, తమ పార్టీ స్టాండ్ తమకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈనెల 14వ తేదీన ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. బీజేపీకి ఎటువంటి రాజకీయ లబ్ధి ఉండదని, జాతి ప్రయోజనాలే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. 
ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ మాధవ్‌తోపాటు ఇతర పార్టీ నాయకులు కేంద్ర పెద్దలను కలిశారని, మరికొద్దిరోజుల్లో తామూ కలవబోతున్నామని చెప్పారు.
ఈ ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టింది అసాధారణమైన బడ్జెట్ అని ఆమె కొనియాడారు. కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లోనూ అసాధారణ బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆమె చెప్పారు. 
పెట్రోల్‌పై టాక్స్‌లను రాష్ట్ర ప్రభుత్వమే తగ్గించుకోవాలని ఆమె సూచించారు. ఆరోగ్యం, మానవ వనరులతో పాటు ఆరు అంశాలను గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటుందని, నిధులు ఇస్తుందని పురంధేశ్వరి భరోసా ఇచ్చారు.
రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడం లేదన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రానికి ఆర్థికంగా కేంద్రం ఎంతో మేలు చేస్తోందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై అగ్రిసెస్‌ విధించినంత మాత్రాన రేట్లు పెరగవని, ఆ మేరకు కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తుందని చెప్పారు.