రామమందిర నిర్మాణం చారిత్రాత్మక ఘట్టం 

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణాన్ని చేపట్టడం చారిత్రాత్మక ఘట్టమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. విశాఖపట్నం జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్‌లో బీజేపీ నాయకుడు గంకల అప్పారావు, కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రను పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు అయోధ్యలో రామమందిర నిర్మాణం హిందువుల చిరకాల కోరిక అన్నారు. దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయిన  మందిర నిర్మాణం మోదీ కృషితో సాకారమవుతోందని చెప్పారు. రామ జన్మభూమిలో ఈ ఆలయ నిర్మాణం నిర్మిస్తుండడం హిందువులకు గర్వకారణమని పేర్కొన్నారు.

నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి వేలాది మంది భక్తులు యాత్రల ద్వారా ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. జాతీయ రహదారి ఊర్వశి జంక్షన్‌ నుంచి ఇందిరానగర్‌, కప్పరాడ తదితర ప్రాంతాల గుండా యాత్ర కోలాహలంగా సాగింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, కాశీవిశ్వనాథరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు.