ఆంధ్రప్రదేశ్: మతమార్పిడులపై ప్రధాని కార్యాలయానికి ఎంపీ రఘురామ కృష్ణరాజు సమగ్ర నివేదిక 

ఆంధ్రప్రదేశ్: మతమార్పిడులపై ప్రధాని కార్యాలయానికి ఎంపీ రఘురామ కృష్ణరాజు సమగ్ర నివేదిక 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని కార్యాలయానికి నివేదిక సమర్పించారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని కార్యాలయ సహాయక మంత్రి డాక్టర్ శ్రీ జితేందర్ సింగ్ కు ఈ నివేదిక సమర్పించారు.  రాష్ట్రంలో  ఎస్సీల కోసం ఉద్దేశించిన రిజిర్వేషన్లు దుర్వినియోగం, అక్రమ మతమార్పిళ్ల తీరుతెన్నులు, అందకు క్రైస్తవ ఎన్జీవోలు అనుసరిస్తున్న విధానాలు, క్రైస్తవ సంస్థలకు విదేశాల నుండి వస్తున్న నిధుల వినియోగంలో అక్రమాలను సమగ్రంగా వివరిస్తూ రూపొందించిన ఈ నివేదికలో ఈ అక్రమ మతమార్పిళ్లను అరికట్టేందుకు కొన్ని కీలకమైన సూచనలు కూడా చేశారు.

ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రధాని కార్యాలయానికి సమర్పించిన నివేదికలోని కొన్ని ముఖ్య అంశాలు:

క్రైస్తవ మతమార్పిడులను అధికారికంగా నమోదు చేసే విధానాలేవీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పాటించడం లేదని నివేదికలో పేర్కొన్నారు. దీంతో యథేచ్ఛగా క్రైస్తవ మతమార్పిళ్లు జరుగుతున్నప్పటికీ అధికశాతం మంది క్రైస్తవులు రిజర్వేషన్ల లబ్ది కోసం హిందువులుగానే అధికార రికార్డుల్లో చెలామణి అవుతున్నారు. దీంతో రాజ్యాంగ ఉల్లంఘన జరగటమే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. క్రైస్తవ మతం మారి కూడా రిజర్వేషన్లు పొందుతున్న క్రైస్తవుల చర్యల కారణంగా అసలైన షెడ్యూల్డ్ కులాల ప్రజల తమ విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కోల్పోతున్నారు. వీటిని కట్టడి చేసే విధానాలేవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించడం లేదన్న విషయం ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

పలు ఆశ్చర్యకరమైన అంశాలు నివేదికలో పొందుపరిచారు. నివేదికలో ఉదహరించిన దాని ప్రకారం.. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న చర్చిల సంఖ్య 68 కాగా ఆ మండలంలో గ్రామాల సంఖ్య మాత్రం 11.  అంటే.. సగటున గ్రామానికి 6 చర్చిలన్న మాట!! ఇదిలా ఉంచితే 2011 జనాభా గణన ప్రకారం రెడ్డిగూడెం మండలలోని క్రైస్తవ జనాభా 630. కానీ ఇదే మండలంలోని మద్దులపర్వ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుంటే, సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ శాఖ ఇచ్చిన సమాచారం నివ్వెరపరుస్తుంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మద్దులపర్వ గ్రామంలో క్రైస్తవులెవరూ లేరు. కానీ అక్కడ ఉన్న చర్చిల సంఖ్య మాత్రం ప్రభుత్వ రికార్డుల ప్రకారం 11.

మ‌రో ఉదాహార‌ణను ప‌రిశీలిస్తే… ప్రకాశం జిల్లా పెద్ద అరవిడు మండలంలోని 33 మంది పాస్టర్లకు ప్రభుత్వం రూ .5 వేల గౌరవ వేతనం ఇస్తోంది.  కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ మండ‌ల ప‌రిధిలో మొత్తంగా కేవలం 16 మంది క్రైస్తవులు ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇక గుంటూరు జిల్లా జనాభా లెక్కలను గమనిస్తే  నివ్వెర పోవాల్సి వస్తుంది. 1961 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాలో 5.4 శాతం ఎస్సీ జనాభా ఉండగా 13.4 0% క్రైస్తవ జనాభా ఉంది. 2011 జనాభా లెక్కల నాటికి ఎస్సీల జనాభా 9.5 9 శాతానికి పెరగగా  క్రైస్తవ జనాభా 1.84 శాతానికి తగ్గింది. ఈ లెక్కన గడచిన 50 ఏళ్లలో అనేక మంది హిందూ మతానికి చెందిన ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారారు. కానీ వారు ఇంకా ఎస్సీ రిజర్వేషన్ సదుపాయాలను పొందుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, స్కాలర్షిప్  లు, ఎస్సీ రుణాలు  ఇంకా మరెన్నో వసతులు అసలైన ఎస్సీలకు అందకుండా క్రైస్తవ లోకి చేరిన వారే ఈ అక్రమంగా అనుభవిస్తూ నిజమైన ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు.

విదేశీ సంస్థల నుంచి పొందిన నిధుల దుర్వినియోగం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ మత మార్పిడులు పెరగడానికి  విదేశీ సంస్థల నుంచి పొందుతున్న నిధుల దుర్వినియోగానికి పాల్పడటమే ప్రధాన కారణమని స్పష్టంగా అర్థం అవుతోందని రఘురామ కృష్ణరాజు నివేదికలో పేర్కొన్నారు. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా విదేశీ సంస్థల నుంచి సేకరించిన నిధులతో రాష్ట్రంలో ఇష్టా రాజ్యాంగ చర్చి నిర్మాణాలు సాగిస్తూ క్రైస్తవ మత మార్పిడులకు పాల్పడుతున్నారు అని పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ఆయన తన నివేదికలో ప్రస్తావించారు.

మతమార్పిడి నిలయాలుగా అనాథశరణాయలు:

పాఠశాలలు, శిశు సంరక్షణ కేంద్రాలు, అనాథ శరణాలయాలు కేంద్రంగా క్రైస్తవ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని రఘురామ కృష్ణరాజు తన నివేదికలో తెలిపారు. మైనర్ విద్యార్థులకు బలవంతంగా బైబిల్ చదవడం తప్పనిసరి చేసి ఆ తర్వాత విద్యార్థుల తల్లి దండ్రులకు తెలియకుండానే వారిని మతం మార్చుతున్న అనేక ఉదంతాలు గురించి ప్రస్తావించారు.

దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే కుట్ర

భారతదేశంలో అనేక క్రైస్తవ సంస్థలు సాగిస్తున్న మతమార్పిడి కార్యకలాపాలు, ఆర్ధిక అక్రమాలను అరికట్టడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడీకి చెడ్డపేరు తీసుకువచ్చే విధంగా క్రైస్తవ మిషనరీ సంస్థల నిర్వాహకులు, ఆ సంస్థల విదేశీ దాతలు పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతున్నారని, దేశ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా వారి ప్రకటనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మత మార్పిడులను అరికట్టాలని, వాటికి ప్రోత్సహిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు న్యాయం చేయాలని ఆయన తన నివేదికలో కోరారు.

మతమార్పిడుల కారణంగా రిజర్వేషన్ల విషయంలో నిజమైన షెడ్యూల్డ్ కులాల ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై అధ్యయనం చేసేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా ఒక కమిటీ ఏర్పాటు ద్వారా తగు చర్యలు చేపట్టాలని, ఇప్పటికే కొన్ని క్రైస్తవ సంస్థలపై దాఖలైన ఫిర్యాదుల విషయంలో సత్వర విచారణ, చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు తన నివేదికలో ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు.

Source: VSK Telangana