విజయసాయిరెడ్డి వాఖ్యలపై వెంకయ్య మనస్తాపం

రాజ్యసభలో వైసిపి సభ్యుడు విజయసాయిరెడ్డి తనను ఉద్దేశించి చేసిన తీవ్రమైన వాఖ్యలపై సభ చైర్మన్, ఉపాధ్యక్షుడు ఎం వెంకయ్యనాయుడు తీవ్ర మనస్థాపం చెందారు. ఆయన తీరును ఇతర పార్టీల ఎంపీలు సహితం తప్పు పట్టి తగు చర్య తీసుకోవలసింది అని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ సీఎం జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతించలేదు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా వెంకయ్యపైనే తీవ్ర వ్యాఖ్యలకు దిగారు.

అనంతరం వీటిని రికార్డుల నుంచి తొలగించాలంటూ వైసీపీ ఎఁపీ విజయసాయిరెడ్డి పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. దీనికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకరించలేదు. దీంతో అసలు గొడవ మొదలైంది. సభలో లేని వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలంటూ తాను ఇచ్చిన పాయింట్ ఆఫ్‌ ఆర్డర్‌ను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తోసిపుచ్చడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు.
వైసీపీ ఎంపీలతో కలిసి వెల్‌లోకి దూసుకురావడమే కాకుండా వెంకయ్య టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. ఈ హఠాత్పరిణామంతో రాజ్యసభలో ఇతర ఎంపీలు కూడా షాకయ్యారు. బీజేపీనీ, టీడీపీని లింక్‌ చేస్తూ మరీ వెంకయ్యపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం తెలిపారు.

వెంకయ్యనాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఆయన్ను విజయసాయిరెడ్డి రాజకీయంగా టార్గెట్‌ చేసే ప్రయత్నం చేశారు. మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయంటూ సాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే టీడీపీ ఎంపీపై మీరు చర్యలు తీసుకోలేక పోతున్నారంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఓ దశలో వెంకయ్య కూడా అవాక్కయ్యారు. కాసేపటికే కోలుకుని సాయిరెడ్డి వ్యాఖ్యలపై వెంకయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపాదన వచ్చిన వెంటనే పార్టీకి రాజీనామా చేశానని, అప్పటినుంచి ఇప్పటివరకూ రాజకీయ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదని గుర్తుచేశారు. తన హృదయం దేశ ప్రజలతో మమేకమై ఉందని తెలిపారు. అయితే ఎవరేం వ్యాఖ్యలు చేసినా తాను పట్టించుకోబోనని వెంకయ్య చెప్పారు.  వ్యక్తిగతంగా మాత్రం సాయిరెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని పేర్కొన్నారు. దీంతో ఇతర పార్టీల ఎంపీలు కూడా జోక్యం చేసుకుని విజయసాయిరెడ్డిపై చర్యలకు డిమాండ్‌ చేశారు