పాక్ కుతంత్రాలు ఆ దేశ సరిహద్దులకే 

పాకిస్తాన్ సైనిక దళాలు పాల్పడే దుస్సాహసాలకు భారత సైన్యం దీటుగా జవాబిస్తూ వాటి కుతంత్రాలను ఆ దేశ సరిహద్దులకే కట్టడి చేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న తీవ్రవాద కార్యకలాపాలను కట్టడి చేయడంలో సైన్యం, బిఎస్‌ఎఫ్, ఇతర భద్రతా దళాల తీసుకున్న చర్యలను ఎంత ప్రశంసించినా తక్కువేనని రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక లిఖితపూర్తక సమాధానంలో మంత్రి తెలిపారు. 

పాకిస్తాన్ పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పాక్ సైన్యం పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనల పట్ల భారత సైన్యం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సైన్యం చర్యలు తీసుకుంటోందని తాను చెప్పడం లేదని, గతంలో కూడా సైన్యం పటిష్టమైన చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

అయితే సైన్యం తీసుకుంటున్న చర్యలు, అవి ఉపయోగిస్తున్న ఆయుధాలకు సంబంధించిన వివరాలు వెల్లడించడం సబబు కాదని మంత్రి చెప్పారు. భారత సరిహద్దుల్లోకి ఉగ్రవాదులను పంపేందుకు, వారిని తిరిగి రప్పించేందుకు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడుతోందని మాత్రం తాము చెప్పగలనని ఆయన తెలిపారు. 

సరిహద్దుల వద్ద మన సైన్యం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని, కాల్పుల విమరణ ఒప్పంద ఉల్లంఘనలను దీటుగా ఎదుర్కుంటోందని మనమందరం విశ్వసించాలని ఆయన హితవు చెప్పారు. భారత భూభాగంలో ఉగ్రవాద దాడులకు కుట్రలు పన్నినపుడు మాత్రం కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు పెరుగుతాయని ఆయన తెలిపారు.

సీమాంతర కాల్పులతోసహా 2020లో మొత్తం 5,133 కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు సంబంధించిన ఘటనలు జరిగాయని, 2021లో(జనవరి 28 వరకు) మొత్తం 299 సంఘటనలు సంభవించాయని మంత్రి చెప్పారు. 2020లో 46 మంది ఈ సంఘటనల్లో మరణించారని ఆయన వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఒక సైనికుడు మరణించాడని రాజ్‌నాథ్ తెలిపారు.