పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ ఆంక్షలను కొట్టేసిన హైకోర్టు 

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్‌పై ఆదేశాలు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది.  నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై ఆదివారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందన్న పిటిషనర్‌ తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చని తీర్పులో స్పష్టం చేసింది.  ఇవాళ ఉదయం నుంచి ఇటు మంత్రి తరఫు.. అటు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదుల వాదనలను హైకోర్టు విన్నది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పై విధంగా తీర్పును వెల్లడించింది. అయితే.. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని మాత్రమే హైకోర్టు సమర్థించింది. 

మంత్రి మీడియాతో మాట్లాడేందుకు వీల్లేదన్న ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. ఎన్నికల అంశాలకు సంబంధించి ఏ విషయాలనూ మీడియాతో మాట్లాడకూడదని మంత్రిని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఇంటికి ఎలా పరిమితం చేస్తారని ఎస్ఈసీని పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఏకగ్రీవాలతో పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రభుత్వ విధానమని హైకోర్టుకు న్యాయవాది తెలిపారు.

మరోవైపు.. పెద్దిరెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగులను ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఎస్ఈసీకి సహకరిస్తే అధికారులను బ్లాక్‌ లిస్టులో పెడతామనడం, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని న్యాయవాది చెప్పారు. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డి కదలికలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

హైకోర్టు తీర్పు రాకముందే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికేందుకు ఇంటినుంచి బయటికొచ్చిన పెద్దిరెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. మొదట సీఎం వైఎస్ జగన్‌కు పెద్దిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో కలిసి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.