ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చే బడ్జెట్ 

కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌ ఆర్ధిక వ్యవస్ధకు ఊతమిచ్చేలా ఉందని, దీంతో అన్ని వర్గాలకూ మేలు జరుగుతందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ భరోసా ఇచ్చారు. ఆర్ధిక వ్యవస్ధకు జవసత్వాలు అందించేలా ఉన్న కేంద్ర బడ్జెట్‌ అటు కోవిడ్‌ ముప్పు నుంచి దేశాన్ని రక్షించేలా రూపొందినట్లు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు.

కరోనాతో కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేశామని తెలిపారు. ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించిన విషయాన్ని జై శంకర్ గుర్తుచేశారు. తాజా బడ్డెట్‌లో చేసిన ప్రతిపాదనల అమలతో దేశ ఆర్ధిక వృద్ధి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 11 శాతానికి చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

బడ్డెట్‌లో ఈ ఏడాది కేటాయించిన రూ 2.23 లక్షల కోట్లు గతేడాదితో పోలిస్తే 130 శాతం అధికమని జై శంకర్ తెలిపారు. అలాగే స్వచ్ఛమైన తాగునీరు కోసం ఉద్దేశించిన జల్‌ జీవన్ మిషన్ కోసం రూ 2.08 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు. 13 తయారీ రంగాలకు మౌలిక సదుపాయాల కోసం మరో రూ  2 లక్షల కోట్లు కేటాయించామని వివరించారు.

ఇందులో రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రానిక్‌, తయారీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయని జై శంకర్‌ తెలిపారు. విజయవాడ నుంచి ఖరగ్‌పూర్‌ మధ్య 2022 నాటికి పూర్తయ్యేలా తూర్పు-పశ్చిమ ఫ్రైట్‌ కారిడార్ ప్రకటించామని పేర్కొన్నారు. ఈ బడ్టెట్‌లో ఏపీకి కోటీ 13 లక్షల రూపాయల ఖర్చుతో 14 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు జై శంకర్‌ వెల్లడించారు.