పెట్రో ధరల తగ్గింపు బాధ్యత రాష్ట్రాలదే

పెట్రో ధరల తగ్గింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. కేంద్రం చేయాల్సిందంతా చేసిందని, ఎక్సైజ్‌ సుంకాన్ని కూడా తగ్గించిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను బట్టి పెట్రో ధరల్లో మా ర్పులుంటాయని చెప్పారు. 

శనివారం తెలంగాణకు వ చ్చిన ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేయలేదని, కొవిడ్‌ సమయంలోనూ ప్రత్యేక నిధులు ఇచ్చామ ని తెలిపారు. ‘‘2021-22లో పన్నుల వాటాలో రూ 13,990 కోట్లు రానున్నాయి. ఆర్థిక సంఘం గ్రాంటు రూపేణా మరో రూ.2,500 కోట్లు వస్తాయి. కరోనా సమయంలో రూ.350 కోట్ల ప్రత్యేక నిధులిచ్చాం” అని పేర్కొన్నారు. 

ఎఫ్‌ఆర్‌బీఎంను 3 నుంచి 5 సత్యంకు పెంచేందుకు అనుమతినిచ్చామని గుర్తు చేశారు. జాతీయ రహదారులకు రూ. 20వేల కోట్లు ఇవ్వడం సాధారణ విషయం కాదని ఆయన వివరించారు. కొత్తగా 100 సైనిక్‌ స్కూళ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్‌ ఊతమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

పౌరులపై ఒక్క రూపాయి కూడా అదనపు పన్ను వేయలేదని తెలిపారు. బడ్జెట్‌లో రక్షణ రంగానికి గణనీయంగా కేటాయింపులు పెంచినట్లు ఠాకూర్‌ పేర్కొన్నారు.  నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్లు  ఠాకూర్‌ వెల్లడించారు. ‘‘ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును కేంద్రం ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంది. ఏ కంపెనీకి సాయం అందిస్తే బలోపేతమవుతుందో అంచనా వేస్తుంది. కంపెనీలన్నీ అమ్మకానికి పెట్టడం లేదు.’’ అని చెప్పారు.

విశాఖలో ఉద్యోగులు, కార్మికుల ఆందోళనపై స్పందిస్తూ.. కొన్ని కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత మెరుగైన ఫలితాలొచ్చాయని, ఉద్యోగుల వేతనాలు కూడా పెరిగాయని పేర్కొన్నారు. బీజేపీ, లఘు ఉద్యోగ్‌ భారతి ఆధ్వర్యంలో మేధావులు, పారిశ్రామికవేత్తలతో బడ్జెట్‌పై నిర్వహించిన సమావేశంలో  అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఇంటర్‌ లింక్‌ ద్వారా ఫ్రైట్‌ కారిడార్‌ వస్తుందని ప్రకటించారు. 

కాగా, కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఏమీ మాట్లాడడం లేదని, దీనిని బట్టి వారు సంతోషంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అధోగతి పాలయిందని, ధనిక రాష్ట్రం కాస్తా పేద రాష్ట్రంగా మారిందని విమర్శించారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణను శక్తిమంతంగా తీర్చిదాల్సిన అవసరం ఉందని, అందు కోసం బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనా, ప్రధాని మోదీ ప్రభుత్వం సాహసోపేత బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. బడ్జెట్‌ను వివరించేందుకు దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు.