మంత్రి పెద్దిరెడ్డిని 21 వరకు ఇంటికే పరిమితమే చేయండి!

హద్దు మీరు ఎన్నికల కమీషన్ పై వాఖ్యలు చేస్తున్న పంచాయత్ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలని  డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను ఎన్నికల కమిషన్‌  ఆదేశించింది.  మంత్రి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది. ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకుంటుంన్నామని ఎస్‌ఈసీ పేర్కొంది.
 
మంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని, వైద్య సదుపాయాల కోసం కూడా వెళ్లవచ్చని ఉత్తర్వుల్లో ఎస్‌ఈసీ పేర్కొంది. కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ప్రభుత్వ అభిష్టంకు వ్యతిరేకంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్న రాష్త్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకొని నిత్యం ప్రకటనలు చేస్తున్నవారిలో మంత్రి పెద్దిరెడ్డి ముందున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే శుక్రవారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్‌ లిస్ట్‌లో పెడతాం. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతాం’ అని హెచ్చరించారు.
అయితే, నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాల్ని ఖాతరు చేయాల్సిన అవసరంలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంత్రిని ఇంట్లో పెట్టాలనే ఆలోచన దుర్మార్గమని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నారని ఆరోపించారు. తనపై ఆదేశాలు ఇచ్చే ముందు అమలవుతాయో లేదో చూసుకోవాలని హితవు చెప్పారు.  అధికారులు నిర్భయంగా పనిచేయాలని పెద్దిరెడ్డి చెప్పారు. 
కాగా,ఇప్పటివరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు నిప్పులు చెరిగిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎట్టకేలకు దిగివచ్చారు. శనివారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని, వ్యతిరేకంగా మాట్లాడనని ప్రకటించారు. అంతేకాదు అక్రమాలకు పాల్పడనని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని చెప్పారు. అయితే,  నిన్నటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా వ్యవహరించని ఎన్నికల అధికారులపై చర్యలు తసుకుంటామని హెచ్చరించారు.