టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తరువాతనే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు గంటా శ్రీనివాస్ శనివారం లేఖ రాశారు.
చాలా కాలంగా టిడిపికి దూరంగా ఉంటూ, అధికారంలో ఉన్న వైసిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న గంటా శ్రీనివాసరావు ఇప్పుడు రాజీనామా ప్రస్తావన తేవడం ఆసక్తి కలిగిస్తున్నది. అయితే విశాఖలోని వైసీపీ కీలక నేతలు వ్యతిరేకిస్తూ ఉండడంతో ఆ పార్టీలో చేరడం ఆయనకు సాధ్యం కావడం లేదు.
మొదట్లో టిడిపి నుండి లోక్ సభకు ఎన్నికైన ఆయన తర్వాత ప్రజారాజ్యం పార్టీ నుండి అసెంబ్లీకి ఎన్నికై, ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తిరిగి 2014 ఎన్నికల ముందు టిడిపిలో చేరి, శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. 2019లో గెలుపొందిన టిడిపి ఓటమి చెందడంతో ప్రతిపక్షంలో ఉండలేకపోతున్న ఆయన ఇప్పుడు స్టీల్ ప్లాన్ అంశాన్ని ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
రాజీనామా బేషరతుగా, ఎటువంటి కారణాలు లేకుండా ఉంటేగాని చెల్లుబాటు కాదు. నిర్ణీత ఫార్మాట్ లో లేని ఆయన రాజీనామా కేవలం రాజకీయ ప్రచారం కోసమే అని స్పష్టం అవుతుంది. గంటా తాను స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొనడంతో అది సాంకేతికంగా చెల్లుబాటు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని గంటా శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా పోరాటం చేస్తానని గంటా తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని గంటా శ్రీనివాస్ సూచించారు.
More Stories
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు