జమ్మూ కశ్మీర్ అంతటా 4జీ సేవల పునరుద్ధరణ

జమ్మూ కశ్మీర్ అంతటా 4జీ సేవల పునరుద్ధరణ
జమ్మూ కశ్మీర్‌లో 4జీ సేవలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ అంతటా 4జీ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ అధికారులు ప్రకటించారు. ఇలా జమ్మూ కశ్మీర్ అంతటా 18 నెలల తర్వాత 4జీ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. 
 
”మొత్తం జమ్ము, కాశ్మీర్‌లో 4 జి మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించబడుతున్నాయి” అని జమ్మూ కాశ్మీర్‌ పరిపాలన ప్రతినిధి రోహిత్‌ కన్సల్‌ ట్వీట్‌ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. 
 
2019 ఆగస్టు 5 న జమ్ముకాశ్మీర్‌లో ఇంటర్నెట సేవలు నిలిపివేశారు. దీంతో ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలోనే ఎక్కువ కాలం ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేసిన ప్రభుత్వంగా మోడీసర్కార్‌ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. గత ఏడాది ఆగష్టు లో రెండు జిల్లాల్లో ఈ సేవలను పునరుద్ధరించారు. మిగిలిన చోట్ల 2జి సేవలను మాత్రమే అందుబాటులో ఉంచుతూ వస్తున్నారు. ఈ సేవలను పునరుద్ధరించిన తర్వాత పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకొంటామని అధికార వర్గాలు తెలిపాయి. 
 
ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 4జి సేవలను పునరుద్ధరించిన భద్రతా సంబంధ సమస్యలు పెద్దగా తలెత్తకపోవచ్చని భద్రతా దళాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా వీటిని పునరుద్దరించాలని కేంద్ర హోమ్ కార్యదర్శి అజయ్ భల్లా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత లెఫ్టినంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం వీటిని పునరుద్దరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యంగానైనా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా హర్షం ప్రకటించారు. 
 
“రాష్ట్రంలో రెండు జిల్లాలో మాత్రమే 4జి సదుపాయం ఉన్నట్లు నాకు తెలుసు. త్వరలో ఈ విషయమై ప్రజలు శుభవార్త వింటారు” అని కొద్దీ రోజుల క్రితం మనోజ్ సిన్హా ప్రకటించారు. ఆయన ఇక్కడ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈ సేవల పునరుద్దరణకు కృషి చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.