నక్సల్స్ ప్రాంతాలకు సీఆర్‌పీఎఫ్ మహిళా కమెండోలు

నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు మహిళా కమెండోలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
సీఆర్‌పీఎఫ్ 88వ మహిళా బెటాలియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాల్లో విధి నిర్వహణకు పంపించాలని నిర్ణయించినట్లు సీఆర్ పీఎఫ్ తెలిపింది. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటు చేసిన ఘనత సీఆర్ పీఎఫ్‌కే దక్కింది. 
 
సీఆర్ పీఎఫ్ మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాలకు పంపించి  నక్సలైట్ల ఆట కట్టిస్తామని సీఆర్‌పీఎఫ్ పేర్కొంది. సీఆర్‌పీఎఫ్ మహిళా బెటాలియన్ లోని 34 మంది మహిళలను  కోబ్రా దళంలోకి ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా మూడు నెలల పాటు కమాండో శిక్షణ ఇస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్ డైరెక్టరు జనరల్ ఏపీ మహేశ్వరి చెప్పారు. 
 
మహిళా బెటాలియన్‌లో పనిచేస్తున్న పలువురు మహిళలకు అశోక్ చక్రతోపాటు  పలు అవార్డులు లభించాయి.విధి నిర్వహణలో సీఆర్‌పీఎఫ్ దళం అత్యంత ధైర్యసాహసాలు చూపిస్తుందని డీజీ వివరించారు.
 
న‌క్స‌ల్ వ్య‌తిరేక ఆప‌రేష‌న్ల‌లో పాల్గొనేందుకు 34 మంది మ‌హిళా సీఆర్‌పీఎఫ్ సిబ్బంది శిక్ష‌ణ పూర్తి చేసుకున్న‌ది.  కోబ్రా క‌మాండో ద‌ళంగా ఆ సిబ్బంది శిక్ష‌ణ తీసుకున్న‌ది.  క‌మాండో బెటాలియ‌న్ ఫ‌ర్ రిజ‌ల్యూట్ యాక్ష‌న్‌(కోబ్రా) ద‌ళాన్ని 2009లో సీఆర్‌పీఎఫ్ మొద‌లుపెట్టింది.  అడ‌వుల్లో చాక‌చ‌క్య‌మైన యుద్ధ ఆప‌రేష‌న్లు చేప‌ట్టేందుకు ఈ ద‌ళాన్ని రూపొందించారు.
 
ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం పురుషులు మాత్ర‌మే ఈ కమాండో ద‌ళంలో ఉన్నారు. ఇక నుంచి  పురుషుల‌కు తోడుగా మ‌హిళా కోబ్రా ద‌ళం కూడా జంగిల్ ఆప‌రేష‌న్స్‌లో పాల్గొన‌నున్న‌ది.  మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో వీరిని మోహ‌రించ‌నున్నారు. ఇవాళ క‌ర్దాపూర్ గ్రామంలో జ‌రిగిన వేడుక‌లో..శిక్ష‌ణ పొందిన 34 మంది సిబ్బందిని కోబ్రా ద‌ళంలోకి చేర్చుకున్నారు.
 
 సీఆర్‌పీఎఫ్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్  స‌మ‌క్షంలో మ‌హిళ‌లు డ్రిల్స్ చేశారు.  ప్ర‌స్తుతం ఉన్న ఆరు మ‌హిళా బెటాలియ‌న్ ద‌ళాల నుంచి కోబ్రా టీమ్ కోసం మ‌హిళా సిబ్బందిని ఎంపిక చేశారు. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని సుక్మా, దంతేవాడ‌, బీజాపూర్ ప్రాంతాల్లో ఈ మ‌హిళా కమాండోల‌ను మోహ‌రిస్తారు.