సాగు చట్టాలపై చట్టాలపై ఇప్పుడెందుకు ఇంత యాగీ!

ఒకటిన్నర సంవత్సరాల పాటు అమలు కాని, అమలుకు రాని వ్యవసాయ చట్టాలపై  చట్టాలపై ఇప్పుడెందుకు ఇంత యాగీ పెట్టి ఆగం చేస్తున్నారు? అంటూ నిరసనలు తెలుపుతున్న రైతు సంఘాల నాయకులను ప్రముఖ సినీ నటి, బిజెపి నేత విజయశాంతి ప్రశ్నించారు. ప్రభుత్వం ఫోన్ కాల్ దూరంలో చర్చలకు సిద్ధంగా ఉండగా… ఎందుకు ఈ ధోరణి ఎంచుకున్నట్లు? అని ఆమె సోషల్ మీడియా ద్వారా విస్మయం వ్యక్తం చేశారు.

ప్రధాని సానుకూల దృక్పథంతో ముందుకు వస్తే… రైతు సంఘాల నాయకులు మాత్రం వెనక్కి తగ్గుతారా లేదా గద్దె దిగుతారా? అంటూ రాజకీయ శత్రువుల తీరుగా మాట్లాడటం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇవి వారి మాటలా? లేదా వెనుక నుంచి ప్రేరేపిత విరోధులు అనిపిస్తున్నారా? అని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. 

ఇలాంటి ప్రకటనల వల్ల సమస్య మరింత జఠిలమవుతూ వస్తుందే కానీ, పరిష్కారానికి దోహదపడటం లేదని రైతు సంఘాల నేతలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు కొందరు ఏ ప్రోద్బలంతో భారతదేశ అంతర్గత అంశంపై ఇంత అక్కర పెట్టి ట్విటర్ పోస్టింగులకు తెగబడుతున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు.

ఢిల్లీ పరిసరాలలో ప్రస్తుతం నెలకొన్న పోలీసుల ఆంక్షలను ప్రస్తావిస్తూ రహదారి అడ్డంకులు ఢిల్లీ ఎర్రకోట సంఘటనల దృష్ట్యా తీసుకుంటున్న భద్రతాపరమైన జాగ్రత్తలు మాత్రమే అని ఆమె చెప్పారు. రైతు ఉద్యమంలోనే కొందరు మాకు తెలియకుండా ఎర్రకోట సంఘటనలకు పాల్పడ్డారని నేతలు చెబుతున్నప్పుడు, వారి నియంత్రణలో ఉద్యమం లేదని వారే ఒప్పుకున్నట్లు స్పష్టమైందని విజయశాంతి పేర్కొన్నారు.
అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు.. పోలీసులకే రక్షణ లేక దాడులతో దెబ్బలు తిన్నప్పుడు.. తల్వార్ దాడులు జరుగుతున్నప్పుడు.. ట్రాక్టర్లతో ఢీ కొడుతున్నప్పుడు.. అదుపు తప్పితే సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి? వారి ప్రాణాలకు హామీ ఎవరిస్తారు? అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.