భారతీయ సాగు చట్టాలకు అమెరికా బాసట 

సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌పై అమెరికా ప్ర‌భుత్వం స్పందించింది.  మోదీ స‌ర్కార్ రూపొందించిన కొత్త చ‌ట్టాల వ‌ల్ల భార‌తీయ మార్కెట్ల స‌మ‌ర్థ‌త పెరుగుతుంద‌ని అగ్ర‌రాజ్యం అభిప్రాయ‌ప‌డింది.  అయితే ప్ర‌భుత్వానికి, రైతుల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్క‌రించుకోవాల‌ని అమెరికా సూచించింది.
శాంతియుత నిర‌స‌న‌లు ప్ర‌జాస్వామ్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని, భార‌తీయ మార్కెట్ల వృద్ధికి దోహ‌ద‌ప‌డే చ‌ర్య‌ల‌ను స్వాగ‌తిస్తామ‌ని అమెరికా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  మార్కెట్ల స‌మ‌ర్ధ‌త పెర‌గ‌డం వ‌ల్ల ప్రైవేటు రంగంలోకి పెట్టుబుడులు కూడా పెరుగుతాయ‌ని ఆ దేశం అభిప్రాయ‌ప‌డింది.
భార‌త్‌లో జ‌రుగుతున్న రైతు ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై  అమెరికా ప్ర‌భుత్వాన్ని ఓ విలేఖ‌రి ప్ర‌శ్నించగా బైడెన్ ప్రభుత్వం ఈ స‌మాధానం ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో భార‌త విదేశాంగ శాఖ కూడా  ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది.  వ్య‌వ‌సాయ రంగంలో రైతు చ‌ట్టాల‌తో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టామ‌ని, కొంత మంది ఆ చ‌ట్టాల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నార‌ని, దీని వ‌ల్ల ప్ర‌స్తుతం ఆ చ‌ట్టాల అమ‌లు తాత్కాలికంగా నిలిపివేసిన‌ట్లు పేర్కొన్నారు.
ప‌లువురు అమెరికా ప్ర‌జాప్ర‌తినిధులు.. ధ‌ర్నా చేస్తున్న రైతుల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.  శాంతియుతంగా ఆందోళ‌న చేప‌డుతున్న వారి ప‌ట్ల భార‌త్ తీసుకుంటున్న చ‌ర్య‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు హేలీ స్టీవెన్స్ తెలిపారు. మ‌రో ప్ర‌తినిధి ఇహాన్ ఒమ‌ర్ కూడా ఆందోళ‌న చేస్తున్న రైతుల‌కు సంఘీభావం ప‌లికారు.  ప్ర‌పంచంలోని అతిపెద్ద ప్ర‌జాస్వామ్యంపై దాడి జ‌రుగుతున్న‌ట్లు అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లాహ్యారిస్ మేన‌కోడ‌లు మీనా హ్యారిస్ ఆరోపించారు.
కాగా, రైతు ఉద్యమంపై అమెరికా విదేశాంగశాఖ చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ‘పరస్పరం గౌరవించుకొనే విలువలతో భారత్‌, అమెరికా గొప్ప ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన దాడి జనవరి 6న అమెరికా కాంగ్రెస్‌ భవనం క్యాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడిలాంటిదే’  అని పేర్కొన్నది.
ఈ దాడులపై రెండు దేశాలు ఎవరి చట్టాలప్రకారం వారు చర్యలు తీసుకొన్నారు. ఏ సందర్భంలో రైతు ఉద్యమంపై అమెరికా స్పందించిందో అర్థం చేసుకోగలం అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ తెలిపారు.