మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటుపై ఐరాస ఆందోళన

మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి, అత్యవసర పరిస్థితిని ప్రకటించడంపై ఐరాస భద్రతా మండలి  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆంగ్‌సాన్‌ సూకీ సహా ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని సూచించింది. 
 
ఆగ్నేయాసియా దేశంలో సైన్యం తిరుగుబాటు చేసి, అధికారాన్ని హస్తగతం చేసుకోవడంపై కౌన్సిల్‌ స్పందించింది. ఈ నెల 1న మయన్మార్‌లో మిలిటరి అత్యవసర పరిస్థితి ప్రకటించడం, రాష్ట్ర కౌన్సిలర్‌ ఆంగ్‌సాన్‌ సూకీ, ప్రెసిడెంట్‌ విన్‌ మైంట్‌, ఇతర నాయకులను ఏకపక్షంగా నిర్భందించడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అదుపులోకి తీసుకున్న వారందరినీ వెంటనే విడుదల చేసి, ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలని యూఎన్‌ సభ్యులు సైన్యానికి సూచించారు. సురక్షితమైన, స్వచ్ఛంద, స్థిరమైన, గౌరవ ప్రదమైన పరిస్థితులను తిరిగి కల్పించాలని పిలుపునిచ్చారు. 
 
పౌర సమాజం, జర్నలిస్టులు, మీడియాపై ఆంక్షలు విధించడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. యూఎన్‌ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ మీడియాతో మాట్లాడుతూ మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై ఒత్తిడి తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజాన్ని సమీకరిస్తామని పేర్కొన్నారు. 

మయన్మార్‌లో సైనిక ప్రభుత్వ చర్యకు వ్యతిరేకత రానురాను పెరుగుతుండడం ప్రజాందోళనలకు పిలుపు ఇవ్వడం తదితర పరిణామాలు ఎదురౌతుండడంతో ఫేస్‌బుక్ వినియోగాన్ని మిలిటరీ ప్రభుత్వం నిషేధించింది. బుధవారం అర్థరాత్రి నుంచి ఫేస్‌బుక్ అందుబాటులో లేకుండా పోయింది. మయన్మార్‌లో ఫేస్‌బుక్ వినియోగం చాలా ఎక్కువ. అధికశాతం మంది తమ అభిప్రాయాలు వెల్లడించడానికి ఫేస్‌బుక్‌నే అనుసంధానం చేసుకుంటారు.

మరోవంక, ఇటీవల ఎన్నికైన చట్టసభ సభ్యులు 70 మంది మిలిటరీ పాలక వర్గాన్ని విభేధిస్తూ సంకేతాత్మక సమావేశం ఏర్పాటు చేశారు. తాము దేశానికి చట్టసభ్యులం తప్ప మిలిటరీకి కాదని స్పష్టం చేశారు. కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ను విడిచిపెట్టడం ద్వారా మిలిటరీని ధిక్కరించాలని నిర్ణయించారు.

యావత్ దేశ ప్రజల హక్కులను ఇది ఉల్లంఘించడమేనని, ఇది అసలైన ప్రభుత్వానికి ద్రోహం చేసినట్టుని సూకీ నేషనల్ లీగ్‌కు చెందిన డెమొక్రసీ పార్టీ సభ్యుడు ఖిన్ సో సోక్యి విమర్శించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది కూడా తిరుగుబాటు చేశారు. తాము మిలిటరీ అధికారం కింద పనిచేయబోమని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ప్రజలు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ముఖ్య సమాచారాన్ని తెలియచేయడానికి వీలు కల్పించాలని, నిషేధం ఎత్తి వేయాలని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇంటెర్నెట్ సేవలు అందించే టెలినార్ మయన్మార్ సంస్థ కూడా ఫేస్‌బుక్‌ను తాత్కాలికంగా ఆపాలని సమాచార మంత్రిత్వశాఖ ఆదేశించిందని వెల్లడించింది.