మరో 1,000 ఈ-నామ్ మార్కెట్ల విస్తరణ 

రైతుల వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు పారదర్శకంగా జరిగేలా చూసి, ఉత్పత్తుల అమ్మకాలకు అవసరమైన మార్కెట్లను గుర్తించి దేశంలో ఎక్కడైనా వాటిని విక్రయించడానికి వీలు కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన జాతీయ వ్యవసాయ మార్కెట్ ( ఈ-నామ్) సదుపాయాలను రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దపడుతున్నది. 

ఇంతవరకు ఈ-నామ్ 1000 మార్కెట్లలో అందుబాటులో ఉండగా దీనిని మరో 1000 మార్కెట్లకు విస్తరించాలని నిర్ణయించారు. దీనివల్ల ఈ-నామ్ మరింత సమర్ధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ‘ఒక దేశం ఒకే మార్కెట్” వ్యవస్థను నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించేలా చూడాలన్న లక్ష్యంతో జాతీయ వ్యవసాయ మార్కెట్ పనిచేస్తోంది.

ఇంతవరకు ఈ-నామ్ లో 18 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో 1000 మార్కెట్లు అనుసంధానం అయ్యాయి. ఈ-నామ్ కింద కార్యకలాపాలను నిర్వహించుకోడానికి 1.69 కోట్ల మంది రైతులు, 1.55 లక్షల మంది వ్యాపారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. పారదర్శకంగా ఆన్ లైన్ విధానంలో జరుగుతున్న బిడ్డింగ్ ప్రక్రియ రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం కలిగించే విధంగా వుంది. దీనితో ఈ-నామ్ ద్వారా జరుగుతున్న వ్యాపార లావాదేవీలు పెరుగుతున్నాయి.

ఇంతవరకు ఈ-నామ్ ద్వారా దాదాపు 1.22 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే  4.13 కోట్ల మెట్రిక్ టన్నుల వస్తువులు, 3.68 కోట్ల కొబ్బరికాయలు, వెదురుల క్రయవిక్రయాలు జరిగాయి. ఈ పద్దతిలో రైతులకు నేరుగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ-నామ్ విజయవంతం కావడంతో దీనిని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా మరింత విస్తరించడానికి కృషి ప్రారంభమయ్యింది. 

కోవిడ్ -19 సమయంలో ఈ-నామ్ లో ఎఫ్పీఓ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సౌకర్యం వల్ల రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్లకు ప్రత్యక్షంగా తీసుకురాకుండానే వాటి సేకరణ ప్రాంతాల నుంచి విక్రయించడానికి వీలు కల్పించింది. ఇంతవరకు ఈ-నామ్ లో 1844  ఎఫ్పీఓ లు వున్నాయి. ఇంతేకాకుండా గిడ్డంగుల నుంచి  వ్యాపారం సాగించడానికి ఈ-నామ్ లో  ఇ-ఎన్‌డబ్ల్యుఆర్ సౌకర్యాన్ని పొందుపరిచారు.