చెత్తను విద్యుత్‌గా మార్చి రైతులకు రూ లక్ష కోట్ల ఆదాయం

చెత్తను విద్యుత్‌గా మార్చడం ద్వారా ప్రభుత్వం రైతులకు అదనంగా లక్ష కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని అందిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో వెల్లడించాయిరు. ఘాజీపూర్ వద్ద గుట్టలుగా పేరుకు పోయిన చెత్తను కూడా త్వరలోనే విద్యుత్ తయారు చేయడం కోసం శుభ్రం చేయడం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు.
 
 ‘గోబర్ ధన్ పథకాన్ని మేము ప్రారంభించాం. ఆవు పేడ, వ్యవసాయ వ్యర్థాలు, నగరాల్లోని చెత్త, అటవీ వ్యర్థాలు, బయోమాస్‌లోని కార్బన్.. ఇలా ప్రతిదాన్నీ విద్యుత్‌గా మారుస్తాం. మరికొద్ది రోజుల్లోనే ఘాజీపూర్ వద్ద ఉన్న చెత్త గుట్టలను శుభ్రం చేస్తాం’ అని ప్రకటించారు. దానినుంచి తయారు చేసే విద్యుత్‌తో రైతుల ఖాతాల్లోకి లక్ష కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని ఇవ్వనున్నామని చెబుతూ  దానితో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన్ చెప్పారు.
రూ 20 వేల కోట్ల విలువైన ఎథనాల్‌ను సేకరించడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించిందని మంత్రి చెప్పారు. ‘202021లో 325 కోట్ల లీటర్ల ఎథనాల్‌ను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. రూ.20,000 కోట్ల విలువైన ఎథనాల్‌ను కొనుగోలు చేయడాన్ని ప్రారంభించాం. మొత్తం ఇంధన అవసరాల్లో ఇది 8.5 శాతం. రాబోయే రోజుల్లో దీన్ని 20 శాతానికి పెంచుతాం’ అని ప్రధాన్ తెలిపారు.

దీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరలపై చట్టాన్ని తీసుకు రాకుండా, ఇప్పుడు ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును మంత్రి తప్పుబడుతూ, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ  ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు ఆహార ధాన్యాల సేకరణను గణనీయంగా పెంచినట్లు స్పష్టం చేశారు.

‘గతంలో మీరు ఎందుకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకు రాలేదు. మీ నాలుగు తరాలకు ఈ దేశాన్ని పాలించే అవకాశం వచ్చింది. చాలా రాష్ట్రాల్లో మీరు అది మీ జాగీరుగా భావించి పాలించారు. మీరు ఎప్పుడైనా ఎంఎస్‌పి చట్టాన్ని తెచ్చారా? ఇప్పుడు మీరు మమ్మల్ని కనీస మద్దతు ధర ఎక్కడ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు’ అంటూ కాంగ్రెస్ నేతలను నిలదీశారు. 

`మీ హయాం (2013 14) రైతులకు కనీస మద్దతు ధరగా రూ.97,110 కోట్లు ఇచ్చారు. అదే మా హయాం (2020 21)లో రూ.2.60 లక్షల కోట్లు ఇచ్చాం. రైతుల సంక్షేమానికి నిజాయితీగా పని చేస్తున్న వారిని మీరు ప్రశ్నిస్తున్నారు’ అని ప్రధాన్ కాంగ్రెస్ పార్టీనుద్దేశించి విమర్శలు గుప్పించారు.