దివ్యాంగులకు టోల్ ప్లాజాల ఫీజు మినహాయింపు 

దివ్యాంగులు లేదా అంగ‌వైక‌ల్యం ఉన్న‌వారు.. టోల్ ప్లాజాల వ‌ద్ద ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా సంస్థ మంత్రి నితిన్ గ‌డ్క‌ర్ తెలిపారు.  లోక్‌స‌భ‌లో ఆయ‌న ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ ఈ విష‌యాన్ని చెప్పారు.  దివ్యాంగుల‌కు టోల్ ఫీజు నుంచి మిన‌హాయింపు క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.  

అలాంటి వ్య‌క్తుల కోసం ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌ను ఎత్తివేసిన‌ట్లు ఆయన చెప్పారు.  యూజ‌ర్ ఫ్రెండ్లీ ఉండే రీతిలో దివ్యాంగుల‌కు వాహ‌నాల‌ను డిజైన్ చేయాలంటూ కంపెనీల‌ను కూడా ప్రోత్స‌హిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.  దివ్యాంగుల‌కు టోల్ ఫీజు మిన‌హాయింపు క‌ల్పిస్తున్నారా అని బీజేపీ ఎంపీ ర‌మేశ్ బిదురీ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో గ‌డ్క‌రీ ఆ ప్ర‌శ్న‌కు బ‌దులు ఇచ్చారు. 

భార‌త్ ‌మాలా ప్రాజెక్టుకు సంబంధించిన వివ‌రాల‌ను కూడా గ‌డ్క‌రీ వెల్ల‌డించారు.  ఆ ప్రాజెక్టు కింద 13,521 కిలోమీట‌ర్ల మేర ప‌నులు మొద‌లైన‌ట్లు చెప్పారు.  ఇప్ప‌టికే 4070   కిలోమీట‌ర్ల ప‌నులు పూర్తి అయిన‌ట్లు వెల్ల‌డించారు.  మ‌రో 16,500 కిలోమీట‌ర్ల కోసం డీఆర్‌పీ జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. 

ల‌క్ష కోట్ల బ‌డ్జెట్‌తో ర‌హ‌దారుల‌ను నిర్మిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.  7600 కిలోమీట‌ర్ల మేర 22 గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ల‌ను డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు చెప్పారు.  2800 కిలోమీట‌ర్ల మేర రోడ్డు ప‌నుల‌ను అప్ప‌గించిన‌ట్లు తెలిపారు.  1350 కిలోమీటర్ల ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేకు కొన్ని కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని చెప్పారు.