రిహన్నా, గ్రెటాల ట్వీట్స్ పై ఖుష్బూ ఆగ్రహం

భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో బయటివారు జోక్యం చేసుకోవడం అంగీకార యోగ్యం కాదని బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ స్పష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా ట్వీట్లు చేసిన పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణవేత్త గ్రెటా థన్‌బెర్గ్ తదితరులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వాస్తవాలు తెలుసుకోకుండా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యాఖ్యలు చేయడానికి ముందు సాగు చట్టాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరారు. భారతీయులకు తమ హక్కులపై పూర్తి అవగాహన ఉందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని తెలిపారు.

రైతుల జీవితాలను మెరుగుపరచాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. నిజమైన రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆమె చెప్పారు.  కొందరు వ్యక్తులు దేశంతో ఘర్షణపడుతూ, దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. రైతుల దుస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుందని తెలిపారు. ఈ విషయంలో బయటివారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆమె  ఖండించారు.

భారతీయులంతా సమైక్యంగా ఎల్లప్పుడూ నిలిచారని పేర్కొంటూ ఈ ఐకమత్యాన్ని నాశనం చేయడానికి ఎవరికీ అవకాశం ఇవ్వబోమని ఆమె స్పష్టం చేశారు. వ్యాఖ్యలు ఎవరైనా చేయవచ్చునని, ఇది స్వేచ్ఛా ప్రపంచమని పేర్కొన్నారు. నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం ఆమోదయోగ్యం కాదని ఆమె చెప్పారు. వ్యాఖ్యలు చేసేవారు రెండో వైపు కూడా చూసి, అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.