ఆర్టీసీ బ‌స్సుల్లో తిరుమల ద‌ర్శ‌నం టిక్కెట్లు

ఆర్టీసీ బ‌స్సుల్లో తిరుమల ద‌ర్శ‌నం టిక్కెట్లు

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లే ప్ర‌యాణికుల‌కు ఏపీఎస్ఆర్టీసీ ఓ శుభ‌వార్త తెలిపింది. ఆర్టీసీ బస్సుల్లో ఏడు కొండ‌ల‌వాడి ద‌ర్శనానికి వెళ్లే భక్తులకు రూ. 300 శీఘ్ర దర్శనం టికెట్లు పొందే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ వైఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. 

ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు.. బస్సు ఛార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి  వెంటనే శీఘ్ర దర్శనం టికెట్‌ను పొందవచ్చని తెలిపారు. వీరి కోసం ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసింది. 

ఆ టిక్కెట్ల కోసంతిరుమల బస్‌స్టేషన్ చేరుకున్న అనంత‌రం శీఘ్ర దర్శనం చేసుకునేందుకు ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయ‌స‌హ‌కారాలు అందిస్తారు. ఈ క్ర‌మంలో తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో శీఘ్ర దర్శనం టికెట్టును పొంద‌ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆర్టీసీ అధికారులు కోరారు.

ప్రతి రోజు తిరుపతికి ఆర్టీసీ సంస్థ 650 బస్సులు నడుపుతుంది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం విచ్చేసే ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యంగా ఉంటుంది. 

ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ సదవకాశం కల్పించిన తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ కే.ఎస్.జవహార్‌రెడ్డికి ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.