టిడిపి ఎన్నికల మేనిఫెస్టోకు ఎస్‌ఈసీ అభ్యంతరం 

టిడిపి ఎన్నికల మేనిఫెస్టోకు ఎస్‌ఈసీ అభ్యంతరం 

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల కోసం తెలుగు దేశం పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది.  మేనిఫెస్టోను వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీని ఎస్‌ఈసీ ఆదేశించింది. 

పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడంపై టీడీపీకి ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ నోటీసులు జారీ చేశారు. టీడీపీ మేనిఫెస్టోపై ఎస్‌ఈసీకి వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత మద్దిపాటి వెంకటరాజు వివరణపై ఎస్‌ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. 

పార్టీ రహితంగా జరిగే ఎన్నికలకు మెనిఫెస్టో విడుదల చట్ట విరుద్ధమని, టీడీపీ మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో ప్రకటించడం ఎన్నికల నియమావళికి  విరుద్ధమని, టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ముద్రణ, పంపిణీని నిలిపేయాలని వైసీపీ నేత అప్పిరెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌కు ఫిర్యాదు చేశారు. 

ఫిబ్రవరి 2లోపు దానిపై వివరణ ఇవ్వాలని, లేకపోతే వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుందని వెంకటరాజుకు ఇచ్చిన నోటీసులో కమిషన్‌ పేర్కొంది. ఎలెక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోపై చర్యలుంటాయని ఎస్ఈసీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలలో మేనిఫెస్టో సరైనది కాదని ఎస్ఈసీ నిమ్మగడ్డ సూచించిన విషయం తెలిసిందే.