పంచాయతీ ఎన్నికల నిలిపివేత పిటిషన్ కొట్టివేత 

పాత ఓటర్ల జాబితాతో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ కొట్టివేసింది. తాము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని పేర్కొంది. 

ప్రస్తుత పంచాయతీ ఎన్నికలు సవరించిన 2021 ఓటర్ల జాబితాతో జరగడం లేదని, దీని వల్ల 3.6 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటుహక్కును కోల్పతున్నారని, కావున వీటిని వాయిదా వేసి కొత్త ఓటర్ల జాబితాలో నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 

కాగా కొత్త ఓటర్లు జాబితాను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ సిద్దం చేయాల్సిఉండగా, ఇంతవరకు ఆ జాబితా సిద్దం కాలేదు. పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి గొపాలకృష్ణ దివ్వేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఉద్దేశ్యపూర్వకంగానే కొత్త జాబితాను తయారు చేయలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో పాత జాబితాతోనే ఎన్నికలకు వెళ్లాలని ఎస్‌ఇసి నిర్ణయించారు. ఇప్పుడు ఈ నిర్ణయానికి హైకోర్ట్‌ కూడా గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది.

కాగా, పంచాయతీ ఎన్నికలు నిలుపుదల ఆఖరి ప్రయత్నం అయిపోయిందని  హైకోర్ట్ తీర్పుపై వాఖ్యానిస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఎన్నికలు ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యాయానిదే అంతిమ విజయమని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేస్తా.. ఏ పార్టీ పట్ల వ్యతిరేకత లేదని చెప్పారు