రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు కేంద్ర న్యాయ శాఖ మంత్రిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలను సంధించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును రాయలసీమలోని కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదనలు పంపించిందా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే, ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా?
దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడంతో సంబంధంగలవారు, సంబంధిత విధానం; ఇతర నగరాల్లో హైకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందా? కర్నూలుకు హైకోర్టును తరలించాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన ప్రస్తుత పరిస్థితి; దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకోవడానికి నిర్దేశించిన నిర్ణీత సమయం; ఒకవేళ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తే, కర్నూలును లీగల్ కేపిటల్‌గా ఈ మంత్రిత్వ శాఖ గుర్తిస్తుందా? తెలియజేయాలని జీవీఎల్ కోరారు.
ఈ ప్రశ్నలకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో సమాధానం చెబుతూ ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన ధర్మాసనంతో అమరావతిలో ఏర్పాటైందని, దీని కార్యకలాపాలు 2019 జనవరి 1 నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని 2020 ఫిబ్రవరిలో ప్రతిపాదించారని తెలిపారు. అయితే ఇతర నగరాల్లో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు లేవని పేర్కొన్నారు.
హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత హైకోర్టును సంప్రదించి తీసుకుంటుంద ఆయన ఆయన చెప్పారు. రాష్ట్ర హైకోర్టు నిర్వహణ ఖర్చులను భరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, అదేవిధంగా, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం రోజువారీ పరిపాలన నిర్వహణకు బాధ్యులని తెలిపారు.
ప్రస్తుత సందర్భంలో హైకోర్టును కర్నూలుకు తరలించడానికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలని తెలిపారు. ఈ విషయాల్లో ఎటువంటి నిర్ణీత సమయాన్ని నిర్దేశించలేదని చెప్పారు. అంతే కాకుండా ఈ అంశం ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు విచారణలో ఉందని పేర్కొన్నారు.

More Stories
పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఒక్కరోజే 30 మంది మృతి
జనసేన ఫిర్యాదుతో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు