వరుసగా అమిత్ దృష్టికి దేవాలయాలపై దాడులు 

ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి వరుసగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దృష్టికి ఎంపీలు తీసుకు వచ్చారు. మొదటగా ఈ  విషయాన్నీ రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జివిఎల్ నరసింహారావు లేవనెత్తి కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని వివరణ అడగాలని సూచించారు. 

వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజుతో భేటీ అయ్యి ఈ విషయాన్నీ ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. ఆ తర్వాత టిడిపి ఎంపీలు హోమ్ మంత్రిని కలసి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై త్వరితగతిన దర్యాప్తు చేయాలని హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు ఆయనను కలసిన అనంతరం  రఘురామ కృష్ణరాజు తెలిపారు.

 ‘నాకు వై కేటగిరీ భద్రత ఇచ్చినందుకు హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపా. విభజన హామీలు, పోలవరం సహా అనేక అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లా. విభజన చట్టం ప్రకారం రావలసిన అంశాలు, రాష్ట్ర సమస్యలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లా’ అని తెలిపారు. 

కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ  రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులు, అమరావతి సెంటి‌మెంట్‌ను హోంమంత్రికి వివరించానని చెప్పారు. ఏపీ పర్యటనకు రావాలని అమిత్ షాను కోరానని, త్వరలో వస్తా అన్నారని పేర్కొన్నారు.

కాగా, లయాలపై దాడులు, మత మార్పిడులు అంశాలను వివరించామని, రాష్ట్ర పరిస్థితులపై అమిత్‌షాకు నివేదిక ఇచ్చామని, త్వరలో సమీక్షిస్తానన్నారని టిడిపి ఎంపీలు అమిత్ షాను కలసిన అనంతరం  గల్లా జయదేవ్ తెలిపారు.

 రాజ్యాంగ వ్యవస్థలపై దాడి.. క్షీణించిన శాంతిభద్రతలను  ఎంపీలు కేంద్రమంత్రికి వివరించారు. న్యాయస్థానాలపై దూషణలు, మండలిరద్దు అంశాలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. టీడీపీ నేత అచ్చెన్న, పట్టాభిపై వైసీపీ దాడులను అమిత్‌షాకు వివరించామని తెలిపారు.

మీడియాపై కేసులు పెడుతున్నారని, ఇలాంటివి జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని అమిత్‌షా చెప్పారని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. అమిత్‌ షా స్పందిస్తూ… ‘ఇంకా ఏమైనా అదనపు వివరాలు, సాక్ష్యాధారాలు ఉంటే మా ఆఫీసులో ఇవ్వండి. తగిన సమయంలో సరైన చర్యలు తీసుకుంటాం‘ అని హామీ ఇచ్చినట్లు జయదేవ్‌, కనకమేడల ఆ తర్వాత విలేకరులకు చెప్పారు.