పంచాయతీ  ఎన్నికలు కాగానే మునిసిపల్ ఎన్నికలు!

పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల కొనసాగింపు, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. విశ్వసనీయ సమాచారం మేరకు పంచాయితీ ఎన్నికలు ముగిసిన వెంటనే మిగులు స్థానిక సంస్థలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని, గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ను మార్పుచేయాలని కమిషన్‌ రంగం  సిద్ధం చేస్తున్నది. 

ఇక మున్సిపల్‌ ఎన్నికలను కూడా తన హయాంలోనే నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆయన మార్చి 31న పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఈలోగా అన్ని రకాల ఎన్నికలను పూర్తి చేసేందుకే ఆయన నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. 

మార్చి తరువాత విద్యార్థులకు పరీక్షల కాలం ప్రారంభం అవుతుందన్న వాదనను కమిషనర్‌ తెరపైకి తీసుకువచ్చి, మార్చిలోనే ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో అవసరమైతే ఎస్‌ఇసిగా కనగరాజ్‌ను నియమించిన సమయంలో కోల్పోయిన కాలం మేరకు తన పదవిని పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని తెలిసింది.