వీసీలను నియమించక పోవడంపై గవర్నర్‌ అసంతృప్తి 

వీసీల నియామకం చేపట్టకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ వ్రాసారు. 10 రోజుల్లోగా వీసీలను నియమించాలని ఆమె ఆదేశించారు. 

తెలంగాణలోని 11 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీసీల నియామకం కోసం 2019 జులై 3న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్లుగా వీసీల నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఇన్‌చార్జ్‌ వీసీలు, రిజిస్ట్రార్లతో గవర్నర్‌ తమిళిసై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్వ విద్యార్థులను యూనివర్సిటీలతో అనుసంధానంపై గవర్నర్ ఆరా తీశారు.

విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించి,  వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాల్సిన విశ్వవిద్యాలయాలు బోధించే ఆచార్యులు లేక వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వేల సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా  వాటి భర్తీకి ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు.

ఏళ్ల తరబడి గెస్ట్‌ ఫ్యాకల్టీ, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే నెట్టుకొస్తుండడంతో ఉన్నత విద్యలో నాణ్యత కొరవడుతోంది. కీలకమైన వైస్‌ చాన్సలర్ల పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉండడం, పాలకమండళ్లను నియమించకపోవడంతో పోస్టుల భర్తీ విషయంలో వర్సిటీలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి.