వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ లతో పాటు మరో 42 మంది బీజేపీ కార్యకర్తలు, రామభక్తులకు బుధవారం బెయిల్ రావటంపై సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులకు భయపడకుండా రామకార్యంలో పాల్గొన్న రామభక్తులందరికీ అభినందనలు తెలిపారు.
తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఆరుగురు మహిళలను అక్రమంగా జైలుకు పంపారని, మరో 38 మంది బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాముడిని కించపరిచిన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యా తీసుకోలేదంటేనే, కేసీఆర్ కు హిందుత్వంపై వున్న గౌరవం అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
ఎవరైతే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ రామయ్యను కించపరిచారో సదరు మంత్రులు, ఎమ్మెల్యేలను మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదని సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులపై, ఇళ్లపై, కార్యాలయాలపై దాడి చేసిన టీఆర్ఎస్ గూండాలను కూడా అరెస్ట్ చేసి ఎందుకు జైళ్లలో పెట్టడం లేదని ప్రశ్నించారు.
రామున్ని అనుక్షణం నిందించే మీకు తెలంగాణా ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని సంజయ్ హెచ్చరించారు. రాముడితో పెట్టుకున్న ముల్లా ములాయంసింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ లకు పట్టిన గతే… కేసీఆర్ కు త్వరలోనే పడుతుందని దయ్యబట్టారు.
రాముడి పట్ల, ధర్మం పట్ల తమ నిబద్ధతను, ఆకాంక్షలను మరింత పెంచాయని, ఇంతకు వందింతల ఉత్సాహంతో రామాలయ నిర్మాణం కోసం రామభక్తులు పనిచేస్తారని ప్రకటించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం హిందువుల స్వాభిమానానికి చిహ్నమని, మందిర నిర్మాణం ప్రతి ఒక్కరి ఆకాంక్ష అని చెప్పారు. రామ రాజ్య స్థాపనకు ప్రతి కర సేవకుడు కృషి చేస్తారని ఎటువంటి నిర్బంధాల కైనా వెనుకాడబోరని సంజయ్ స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, వరంగల్‌లో దాడులకు పాల్పడ్డ టీఆర్‌ఎస్ నేతలను వదిలి.. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి వేధించడం దుర్మార్గమని బీజేపీ నేత విజయశాంతి తప్పుబట్టారు. బీజేపీ కార్యకర్తలు తెగిస్తే జైళ్లు చాలవని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆమె హెచ్చరించారు. వరంగల్ వెళ్లి నిరసన తెలపడానికి సిద్ధమని విజయశాంతి ప్రకటించారు.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
సంచలన ఆరోపణలు చేసే హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత
ఆర్మీ అమ్ములపొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్