సెలెబ్రెటీల ట్వీట్లపై మండిపడ్డ భారత్ 

రైతు నిరసనపై వివిధ రంగాలకు చెందిన సెలెబ్రెటీలు ట్వీట్లు చేయడంపై భారత విదేశాంగ శాఖ భగ్గుమంది. వాటికి ఏమాత్రం కచ్చితత్వం లేదని, అవి బాధ్యతారాహిత్యమైన ట్వీట్లని మండిపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
‘‘సంచలనాలకు మొగ్గు చూపే వ్యక్తులే ఇలా చేస్తున్నారు. ఆ ట్వీట్లకు ఏమాత్రం కచ్చితత్వం లేదు. బాధ్యతారాహిత్యం. భారత దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అలాంటి శక్తులే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశాయి. ఇలాంటి వారి ట్వీట్లతో దేశం చాలా బాధపడింది.’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.
 
పాప్‌సింగర్‌ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా ధన్‌బర్గ్‌లు . భారత్‌లో ఆందోళన చేపడుతున్న రైతులకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నామంటూ మంగళవారం రాత్రి ట్వీట్‌లు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లోని కొన్ని ప్రాంతాలలో చాలా తక్కువ మంది రైతులు మాత్రమే ఈ ఆందోళనలు చేపడుతున్నారంటూ కేంద్రం ఆరోపించింది.
 
అదే విధంగా, రాజకీయ నేపథ్యంలో చూడాలని కోరుకుంటున్నామని,  ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ప్రభుత్వం, సంబంధిత రైతు సంఘాలు చేస్తున్న యత్నాలను గుర్తించాలని ఇండియా టుగెదర్‌, ఇండియా ఎగైనస్ట్‌ ప్రోపగాండ అనే హ్యాష్‌ట్యాగ్‌లకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
ఇటువంటి అంశాలపై వ్యాఖ్యానించడానికి ముందు వాస్తవాలను నిర్థారించుకోవాలని, సమస్యలపై సరైన అవగాహనతో పోస్ట్‌ చేయాలని భారత్ హితవు చెప్పింది. వివిధ వర్గాలతో, పార్లమెంట్‌లో విస్తృతంగా చర్చించిన తర్వాతే చట్ట రూపం దాల్చాయని ప్రకటించింది. నూతన చట్టాలతో రైతులకు ప్రయోజనం ఉంటుందని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది.
 
ఇలా ఉండగా, రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన అంతర్జాతీయ పాప్‌ సింగర్‌ రిహన్నాపై గాయకుడు, నటుడు దిల్జీత్‌ దొసాంజే ఒక పాటను విడుదల చేశారు. ఆమె ట్వీట్‌ చేసిన 16 గంటల్లోనే రిహన్నా మరోపేరైన ‘రిరి’ పేరుతో ఈ పాటను విడుదల చేశారు. దీంతో బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ దిల్జీత్‌పై విరుచుకుపడ్డారు. 
 
వారంతా ఆదాయం కోసం చేస్తుంటారని, మీరు ఎప్పటి నుండి ప్రారంభించారని దిల్జీత్‌ను ప్రశ్నించారు. ఒక పాట విడుదల చేసేందుకు సుమారు నెలరోజుల సమయం పడుతుందని.. అంటే మీరు ఇప్పటికిప్పుడే పాటను విడుదల చేశారని భావించాలా అంటూ దిల్జీత్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు.