బెంగాల్ లో బిజెపి రథ్ యాత్రలకు అడ్డంకులు!

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమబెంగాల్‌లో బీజేపీ తలపెట్టిన రధ్ యాత్రలకు అధికార టీఎంసీ ప్రభుత్వం అడ్డంకులు కల్పించే  ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నెల 6 నుండి తలపెట్టిన ఈ యాత్రకు అనుమతులు ఇచ్చే విషయంలో  కుంటి సాకులతో జాప్యం చేస్తున్నది. ఎక్కడి నుంచి రథయాత్రలు తీయాలనుకుంటున్నారో అక్కడ స్థానిక అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం బీజేపీకి సూచించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో తాము చేపట్టదలచిన రథ్ యాత్రలకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్ఫాన్ బందోపాధ్యాయ కు ఈ నెల 1న రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు ప్రతాప్ బనెర్జీ లేఖ వ్రాసారు. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియహోజకవర్గాలను చుట్టి వస్తూ ఐదు రథ యాత్రలను చేపట్టదలిచారు. ఒకొక్క యాత్ర 20 నుండి 25 రోజులపాటు కొనసాగుతుంది. 

స్థానికంగా శాంతిభద్రతల అంశం చూస్తున్న అధికారులను అనుమతి కోసం సంప్రదించామని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమాధానం ఇవ్వడం అంటే ఈ యాత్రలు కొనసాగే ప్రతి పోలీస్ స్టేషన్ నుండి అనుమతి తీసుకోవలసి ఉంటుందని చెప్పిన్నట్లు అయింది. దీని వల్లన జాప్యం జరగడమే కాకుండా ఏదో సాకులు చూపి ఒకటి,  రెండు పోలీస్ స్టేషన్ లలో అభ్యంతరాలు వ్యక్తమైనా మొత్తం యాత్ర ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. యాత్ర మార్గాన్ని పదే, పదే మార్చుకోవలసి వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. 

షెడ్యూల్ ప్రకారం ఈనెల 6వ తేదీ నుంచి బెంగాల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పరివర్తన యాత్రలకు అమిత్‌షా, జెపి నడ్డా శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రలు 25 నుంచి 25 రోజులు జరుగనున్నాయి. నబద్‌విప్, కూచ్‌బెహర్, కాక్డివిప్, ఝాగ్రాం, తారాపీఠ్ నుంచి ఈ యాత్రలు ప్రారంభం కానున్నారు. తొలి యాత్రను నబద్‌విప్‌లో జేపీ నడ్డా ప్రారంభిస్తారు. కూచ్ బెహర్ నుంచి ఈనెల 11న యాత్రలో అమిత్‌షా పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7న ఒక ప్రాజెక్టును ప్రారంభించేందుకు హల్దియా రానున్నారు. ఆ తర్వాత పార్టీ నిర్వహించే ‘జన్ సభ’లో ఆయన పాల్గొంటారు.

మరోవంక, బీజేపీ రథయాత్రపై ఇప్పటికే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) కూడా కోల్‌కతా హైకోర్టులో దాఖలైంది. బీజేపీ రథయాత్రలతో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితి కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ కోల్‌కతా హైకోర్టు అడ్వకేట్ రామ ప్రసాద్ శంకర్ ఈ ‘పిల్’ వేశారు. 2018లో బీజేపీ ఇలాంటి రథయాత్రకు ప్లాన్ చేసినప్పుడు, శాంతి భద్రతల రీత్యా రథయాత్రను కోర్టు నిలిపేసిన ఉదంతాన్ని కూడా ఆయన తన ఫిల్‌లో ప్రస్తావించారు.