నిరసనలపై ట్విట్టర్ ఖాతాల పునరుద్ధరణపై కేంద్రం ఆగ్రహం

నిరసనలపై ట్విట్టర్ ఖాతాల పునరుద్ధరణపై కేంద్రం ఆగ్రహం

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బుధవారం లీగల్ నోటీసును పంపించింది. రైతుల నిరసనలకు మద్దతు పలుకుతున్న కొన్ని ఖాతాలను నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. మొదట ఈ ఖాతాలను నిలిపేసి, ఆ తర్వాత పునరుద్ధరించినందుకు పర్యవసానాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్సన్ 69ఏ ప్రకారం ఐటీ మంత్రిత్వ శాఖ ట్విటర్‌కు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్న దాదాపు 100 ట్విటర్ అకౌంట్లను, 150 ట్వీట్లను సోమవారం ఉదయం ట్విటర్ నిలిపేసింది. ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అనంతరం ట్విటర్ సోమవారం రాత్రి వీటిని పునరుద్ధరించింది. 

ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం ప్రభుత్వం కొన్ని రకాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా అడ్డుకోవచ్చు. భారత దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రత, దేశ రక్షణ, భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలు, ప్రజాశాంతి, వీటికి సంబంధించి విచారించదగిన నేరాలు జరిగే విధంగా రెచ్చగొట్టడాన్ని నిరోధించడం కోసం ఏదైనా కంప్యూటర్ నుంచి సమాచారాన్ని ప్రజలు పరిశీలించకుండా అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. 

ట్విటర్‌కు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ 18 పేజీల నోటీసును ట్విటర్‌కు బుధవారం పంపించింది. #మోదీప్లానింగ్‌ఫార్మర్‌జీనోసైడ్ హ్యాష్‌ట్యాగ్‌ ప్రజలను రెచ్చగొడుతోందని పేర్కొంది. ప్రజాశాంతి, దేశ భద్రతకు సంబంధించిన కాగ్నిజబుల్ నేరాలకు పాల్పడేవిధంగా ప్రజలను ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా రెచ్చగొడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించడానికి కట్టుబడి ఉండే తటస్థ వేదిక అయిన ట్విటర్ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం సాధ్యమా? కాదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోజాలదని తెలిపింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను మాత్రమే కాకుండా దీనికి జత చేసిన సమాచారాన్ని కూడా తొలగించాలని స్పష్టం చేసింది.  

ఈ హ్యాష్‌ట్యాగ్ రెచ్చగొట్టే విధంగా ఉందని పేర్కొంది. ట్విటర్ 2021 ఫిబ్రవరి 1న సమర్పించిన లేఖలో, పొగడ్తలు, అతిశయోక్తులు, తీవ్రమైన భావోద్వేగపరమైన విజ్ఞప్తులు సుప్రీంకోర్టు తీర్పుల దృష్ట్యా రెచ్చగొట్టే ప్రసంగాలు కాదని చెప్పడంలో పస లేదని పేర్కొంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌కు జత చేసిన కంటెంట్ ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ పట్ల నేరుగా అవిధేయత ప్రదర్శిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. 

ఈ సందర్భంగా చట్టపరమైన ఆదేశం లేని సమయంలో ముఖ్యమైన రాజ్యాంగపరమైన సమతూక చర్యలను చేపట్టవలసిన ట్విటర్ హేతుబద్ధం కానటువంటి రీతిలో వ్యవహరిస్తుండటం స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని వేలెత్తి చూపించవలసిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. 

యూఆర్ఎల్స్/హ్యాష్‌ట్యాగ్స్‌ను బ్లాక్ చేయాలని అంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని బ్లాకింగ్ కమిటీ ధ్రువీకరించిన విషయాన్ని ఈ నోటీసు పునరుద్ఘాటించింది. 2021 ఫిబ్రవరి 1న విచారణ ముగిసిన తర్వాత కూడా అంతకుముందు జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలు కొనసాగుతున్నట్లు తెలిపింది. 

చట్టబద్ధమైన అధికారంగల వ్యవస్థ జారీ చేసిన ఆదేశాలను పాటించరాదని ట్విటర్ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడాన్ని సమర్థించుకుంటూ లేఖ రాసిందని, తద్వారా తాను ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదని అంగీకరించిందని పేర్కొంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే నిర్దిష్ట పర్యవసానాలను ఎదుర్కొనవలసి ఉంటుందని, వీటి గురించి అదే సెక్షన్ వివరించిందని ట్విటర్‌కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసు తెలిపింది. 

సోమవారం ఉదయం సస్పెండయిన ట్విటర్ అకౌంట్లలో కిసాన్ ఏక్తా మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్ (ఏకతా ఉగ్రహాన్), ది కారవాన్ మ్యాగజైన్, ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ వెంపటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జర్నయిల్ సింగ్, సీపీఎం నేత మహమ్మద్ సలీం, యాక్టివిస్ట్ హన్స్‌రాజ్ మీనా తదితరుల ఖాతాలు ఉన్నాయి. సోమవారం రాత్రి వీటన్నిటినీ తిరిగి ట్విటర్ అన్‌బ్లాక్ చేసింది.