రైతుల సమస్యలపై రాజసభలో గందరగోళం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు చెందిన ఎంపీలు సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్డీ గుప్తాలను సభ నుంచి ఈ రోజంతా బహిష్కరించారు.
రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు జీరో అవర్ అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించడానికి ప్రయత్నించారు. అయితే ఇంతలో ముగ్గురు ‘ఆప్’ ఎమ్మెల్యేలు తమ సీట్లలో నుంచి లేచి నిలుచుని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించే సమయంలో రైతుల అంశం లేవదీసి గందరగోళం సృష్టించి, సభకు ఆటంకం కలిగించడం తగదని హితవు చెప్పారు. అయినా కూడా ఆ ముగ్గురు ఎంపీలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన ఆ ముగ్గురు ఎంపీలను ఈ రోజంతా సభ నుంచి బహిష్కరించారు.
వ‌్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో 15 గంటల పాటు చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం ప్రతిపక్షాలతో సమావేశమైన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్చ రాజ్యసభలో జరగనుంది. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తర్వాత ఈ చర్చ జరపనున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో నినాదాలు చేశాయి.
కేవలం రైతుల ఆందోళనలపైనే ఐదు గంటల పాటు చర్చ జరపాలని 16 ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం దానిని 15 గంటలకు పెంచడానికి అంగీకరించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో ప్రకటన చేశారు. చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు.
ఇలా ఉండగా, కొంతమంది ఎంపీలు రాజ్యసభలో మొబైల్స్ వాడుతుండటం గమనించిన వెంకయ్య నాయుడు ఎంపీలు పార్లమెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సభలో జరుగుతున్న కార్యకలాపాలను కొంతమంది ఎంపీలు మొబైల్ ఫోన్‌లతో రికార్డ్ చేస్తున్నారు. ఇలా చేయడం పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధం. రాజ్యసభలో ఫోన్‌ల వాడకంపై పరిమితి ఉంది. హౌస్‌లో జరిగేవి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి’ అని పేర్కొన్నారు.
ఇటువంటి అవాంఛనీయ కార్యకలాపాలకు సభ్యులు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. సభలో అనధికారిక రికార్డింగ్, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలాంటివి సభ హక్కును ఉల్లంఘించడం, సభ నియమాలను ధిక్కారించినట్లు అవుతుందిని హెచ్చరించారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బిజెపి